బింబిసార కాదు….ఇది అంతకు మించి

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసారకు కొనసాగింపు కోసం అభిమానుల ఎదురుచూపులు రెండేళ్లకు పైగా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ నిరీక్షణకు చెక్ పెడుతూ ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాణంలోనే ఇది రూపొందనుంది. మొదటి భాగం దర్శకత్వం వహించిన వసిష్ఠ చిరంజీవి విశ్వంభరలో బిజీగా ఉండటంతో ఇప్పుడా బాధ్యతను అనిల్ పాడూరికి ఇచ్చారు. ఆకాష్ పూరితో రొమాంటిక్ తీసిన అనుభవం తప్ప సోసియో ఫాంటసీని గతంలో హ్యాండిల్ చేయలేదు. అయినా కళ్యాణ్ రామ్ నమ్మి అవకాశం ఇచ్చాడు.

అయితే ఇది అందరూ అనుకున్నట్టు బింబిసార కంటిన్యూయేషన్ కాదట. ఇతని కన్నా వందల సంవత్సరాలకు ముందు త్రిగర్తల సామ్రాజ్యాన్ని పరిపాలించిన మరో లెజెండరీ రాజుకు సంబంధించిన కథను తీసుకున్నారని వినికిడి. స్క్రిప్ట్ పక్కాగా రావాలనే ఉద్దేశంతోనే నెలల తరబడి అనౌన్స్ మెంట్ వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ఏ రాజుని చూపించబోతున్నారనేది రివీల్ చేయకపోయినా పోషించేది కళ్యాణ్ రామేనని వేరే చెప్పనక్కర్లేదు. ఈ మధ్య తెలుగు సినిమాలో చాలా ప్రాముఖ్యత దక్కించుకుంటున్న మహాభారత గాథ ఛాయలు ఇందులో కూడా ఉంటాయని యూనిట్ టాక్.

అమిగోస్, డెవిల్ ఫలితాలు నిరాశపరిచినా కళ్యాణ్ రామ్ ప్రయోగాలు మాత్రం ఆపలేదు. 21వ సినిమా మాత్రం యాక్షన్ జానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. మెరుపు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. లేడీ అమితాబ్ విజయశాంతిని ఒప్పించారంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టుంది. దీని తర్వాత రాబోయే సినిమా ఇవాళ ఇచ్చిన ప్రకటన. అయితే టైటిల్ మారొచ్చని, క్యాప్షన్ గా బింబిసార 2 అని పెట్టి అసలు రాజు పేరుని హైలైట్ చేయబోతున్నారని తెలిసింది. అతనెవరు లాంటి వివరాలు తెలియాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. హీరోయిన్ తదితర వివరాలు ప్రస్తుతానికి గుట్టుగా ఉంచారు.