దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా విభిన్నంగా ఉంటుంది. కేవలం హిట్లు కొట్టడమే కాదు, వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరోలను తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురావడంలో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆయనతో సినిమా అంటే హీరోలకు ఒక రకమైన భరోసా దొరుకుతుంది.

గతంలో సక్సెస్ చూసి చాలా ఏళ్లు గడిచిన కళ్యాణ్ రామ్ కు పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి ఒక కొత్త లైఫ్ ఇచ్చారు. అలాగే రవితేజ వరుసగా అరడజను డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాజా ది గ్రేట్ సినిమాతో మళ్ళీ రీ బర్త్ ఇచ్చారనే చెప్పవచ్చు. ఈ విజయాలు ఆ హీరోల కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయ్యాయి.

వెంకటేష్, వరుణ్ తేజ్ లకు కూడా ఎఫ్ 2 సినిమా కంటే ముందు వరుస ప్లాపులు వెంటాడాయి. ఆ తరువాత వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా 2024లో భారీ డిజాస్టర్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ 2025 సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వచ్చి వెంకీకి సాలిడ్ హిట్ అందించారు. హీరోలకే కాకుండా నిర్మాత దిల్ రాజుకు కూడా వరుసగా రావిపూడి భారీ లాభాలను అందించారు. రావిపూడి టాప్ హిట్స్ అన్ని ఆయన ప్రొడక్షన్ లో వచ్చినవే.

మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, చివరగా భోళా శంకర్ సినిమాతో ఆయన దారుణమైన డిజాస్టర్ చూశారు. దీంతో ఎలాగైనా ఒక పక్కా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి మీద నమ్మకం ఉంచారు. అందుకే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విశ్వంభర సినిమాను కూడా పక్కన పెట్టి మరి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రాజెక్ట్ ను లైన్ లోకి తెచ్చారు.

కేవలం కామెడీ మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకులు కోరుకునే వినోదాన్ని పక్కాగా డెలివరీ చేయడం అనిల్ రావిపూడికి ఉన్న అతిపెద్ద బలం. ప్లాపుల్లో ఉన్న హీరోలు సైతం ఆయనతో సినిమా చేసేందుకు మొగ్గు చూపుతున్నారంటే ఆయన హిట్ ట్రాక్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారీ ప్రయోగాలు కాకుండా అందరికీ అర్థమయ్యేలా కథను చెప్పడంలో ఆయన మాస్టర్ అని చెప్పవచ్చు. ప్లాపుల్లో ఉన్న స్టార్ హీరోలను మళ్ళీ గాడిలో పెట్టడంలో అనిల్ రావిపూడి ఒక రకమైన భరోసాగా నిలుస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ సినిమాతో ఒక మంచి హిట్ అందిస్తారనే నమ్మకం మెగా అభిమానుల్లో బలంగా ఉంది.