రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి ఫ్యామిలీ జానర్ లోకి వచ్చేశాడు. దాని ఫలితమే భర్త మహాశయులకు విజ్ఞప్తి. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈసారి తన శైలికి భిన్నంగా కొత్త రూటు పట్టారు.

వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ ఎంటర్ టైనర్ లో డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సంగీతంలో వామ్మో వాయ్యో సాంగ్ ఆల్రెడీ బాగా వైరలయ్యింది. ఒకరకంగా చెప్పాలంటే భర్త మీద ప్రీ రిలీజ్ వైబ్స్ కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి.

చెప్పిన డేట్ కే భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. లాస్ట్ అయిదారు సినిమాలతో పోలిస్తే ఇది మెరుగనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. భార్య ఉండగానే మరొక అమ్మాయి వలలో పడి ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్ లో రవితేజ ఫ్రెష్ గా కనిపించాడని అంటున్నారు.

అన్నయ్యలో చిరంజీవి చేసినట్టుగా ఆత్మరామ్ క్యారెక్టర్ ని సృష్టించడం ఫ్యాన్స్ కి కొత్త ఫీలింగ్ కలిగించింది. అయితే కిషోర్ తిరుమల తీసుకున్న పాయింట్ మరీ కొత్తది కాకపోవడం వల్ల పూర్తిగా కామెడీ మీద ఆధారపడ్డారు. వెన్నెల కిషోర్, సునీల్ మీద ఆ భారాన్ని పెట్టేసి కొంత భాగం సత్యకు ఇచ్చేశారు.

ప్రాక్టికల్ గా చెప్పాలంటే రవితేజ ఎనర్జీ, కాసింత టైంపాస్ చేయించడంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓ మోస్తరుగా ఓకే. కానీ సామాన్య ప్రేక్షకుల కోణంలో చూస్తే ఇందులో ఎలాంటి ప్రత్యేకత అనిపించదు. హాస్యం కూడా మరీ హిలేరియస్ గా లేదు.

90స్ కిడ్ రోహన్ కూడా మిస్ ఫైర్ అయ్యాడు. పాటల ప్లేస్ మెంట్ సరిగా కుదరలేదు. క్లైమాక్స్ అన్ని వర్గాలను మెప్పించడం అంత ఈజీగా లేదు. ఏదో ఒక మాదిరి జోకులతో థియేటర్లో టైం పాస్ జరిగితే చాలనుకుంటే ఓకే కానీ, ఏవేవో అంచనాలు పెట్టుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందే. మరి రవితేజకి పూర్తి రిలీఫ్ ఇచ్చిందా అంటే సమాధానం చెప్పాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.