చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద అభిమానంతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా థియేటర్‌కు వచ్చాడు. చిరును చూడలేకపోయినా.. తన చెవులతో మెగాస్టార్ మాటలు వింటూ.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను, నటనను, డ్యాన్సులను ఫీల్ అవుతూ.. ఆ సినిమాను ఎంజాయ్ చేశాడు ఆ అంధ అభిమాని.

కళ్లు లేకపోయినా చిరు మీద అభిమానంతో తన తండ్రితో కలిసి థియేటర్‌కు వచ్చిన ఆ అభిమాని థియేటర్లో ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పుట్టుకతోనే గుడ్డివాడైనప్పటికీ ఆ కుర్రాడికి చిరు మీద అభిమానం కలగడం ఆశ్చర్యమే. ఎందుకంటే చిరుకు అభిమానులుగా మారేది ఆయన డ్యాన్సులు, ఫైట్లు, నటన, స్టైల్‌ను చూసి.

కానీ వాటిని కళ్లతో చూసే అవకాశం లేకపోయినా.. చెవులతో వినడం ద్వారా అన్నింటినీ ఫీలవుతూ ఫ్యాన్ కావడం విశేషమే. ‘మన శంకర వరప్రసాద్’ సినిమా చాలా బాగుందంటూ తన ఆనందాన్ని అతను పంచుకున్నాడు. 

‘భోళా శంకర్’ సినిమాతో తన కెరీర్లో ఎన్నడూ లేని పతనం చూశాడు చిరు. కానీ ‘మన శంకర వరప్రసాద్’తో మెగాస్టార్ తనేంటో మళ్లీ రుజువు చేశాడు. ఈ సినిమా చూసిన మెగా అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి.. చిరును ది బెస్ట్‌గా చూపించడం, ఆయన కామెడీ టైమింగ్‌ను బాగా వాడుకోవడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే దిశగా సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది.