మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా మారింది. తన సినిమా బాలేదంటే కట్ డ్రాయర్ మీద తిరుగుతానని ఒక దర్శకుడు అంటే.. మరో నటుడు తాను నటించిన సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరచకపోతే తాను ఇండస్ట్రీనే వదిలేస్తానన్నాడు.

ఇంకా ఇలాంటి స్టేట్మెంట్లు చాలానే చూశాం. ఐతే సినిమా బాగుంటే ఈ స్టేట్మెట్లతో ఇబ్బంది లేదు కానీ.. లేదంటే మాత్రం ఆ స్టేట్మెంట్లు ట్రోల్ మెటీరియల్‌గా మారిపోతుంటాయి. గత ఏడాది తన సమర్పణలో వచ్చిన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా సరిగా ఆడట్లేదంటూ దాని దర్శకుడు ఉద్వేగానికి గురవుతూ చెప్పుతో కొట్టుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇలాంటివి చేయొద్దని వారించిన డైరెక్టర్ మారుతి..

చివరికి తన సినిమా ‘రాజాసాబ్’కు వచ్చేసరికి తాను కూడా కొంచెం లైన్ దాటేశాడు. ఈ సినిమాలో వన్ పర్సంట్ కూడా డిజప్పాయింట్మెంట్ ఉండదని.. అలా ఉంటే తన ఇంటికి వచ్చి నిలదీయవచ్చని చెబుతూ అడ్రస్ ఇచ్చాడు మారుతి.

మారుతి ఈ స్టేట్మెంట్ ఇచ్చినపుడే కొంచెం అతిగా అనిపించింది. రిలీజ్ తర్వాత సినిమా చూసిన జనాలు అతను ఏ ధైర్యంతో ఆ ఛాలెంజ్ విసిరాడా అని ఆశ్చర్పతున్నారు. తన కామెంట్ మీద మీమ్స్ మోత మోగిపోతున్నాయి. మారుతి నిద్రలేచి చూసేసరికి తన ఇల్లంతా ప్రభాస్ ఫ్యాన్స్‌తో నిండిపోయి ఉన్నట్లు.. అతను ఇల్లు వదిలి పారిపోతున్నట్లు.. ఇలా తెలుగు సినిమాల నుంచే అనేక సన్నివేశాల రెఫరెన్సులతో మీమ్స్ తయారు చేస్తున్నారు నెటిజన్లు.

మరోవైపు వేరే సినిమాల ప్రెస్ మీట్లలో కూడా మారుతి కామెంట్ చర్చకు వస్తోంది. తాజాగా ‘నారి నారి నడము మురారి’ ప్రెస్ మీట్లో నరేష్ సినిమా మీద ఫుల్ కాన్పిడెంట్‌గా మాట్లాడారు. ఈ సినిమా హిట్ రాసిపెట్టుకోండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో మరి మీ ఇంటి అడ్రస్ చెబుతారా అని విలేకరులు ప్రస్తావిస్తే.. తాను ఈ సినిమా రిలీజ్ టైంకి గోవాలో ఉంటానని.. వేరే చిత్రం షూటింగ్‌లో పాల్గొంటానని.. ఎవరైనా అక్కడికి వస్తానంటే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తానని నరేష్ వ్యాఖ్యానించడం విశేషం.