ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు చెబుతుంటారు. రీసెంట్‌గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆయన తన జీవనశైలి గురించి చెప్పిన విషయాలు విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మనం రోజూ చేసే పనులను ఆయన పక్కన పెట్టి దశాబ్దాలు గడుస్తున్నా.. ఆయన అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
సాధారణంగా మనం ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయకుండా కాఫీ కూడా తాగం. కానీ మంతెన గారు గత 15 ఏళ్లుగా బ్రష్ కూడా చేయలేదని చెప్పడం సంచలనంగా మారింది. బ్రష్ చేయడం, పేస్ట్ వాడటం వల్ల పళ్లు క్లీన్ అవుతాయని అనుకోవడం పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. తిన్న ఆహారం పద్ధతిగా ఉంటే పళ్లను తోముకోవాల్సిన అవసరమే ఉండదని ఆయన తన అనుభవం ద్వారా వివరించారు.
ఇక సబ్బుల విషయానికి వస్తే ఆయన చెప్పిన మాటలు మరీ ఆశ్చర్యకరంగా ఉన్నాయి. గత 35 ఏళ్లుగా ఆయన ఒంటికి సబ్బు ముట్టుకోలేదట. సున్నిపిండి లాంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలను కూడా వాడకుండా కేవలం నీళ్లతోనే స్నానం చేస్తున్నానని చెప్పారు. మన శరీరానికి సహజంగా ఉండే రక్షణ కవచాన్ని సబ్బులు దెబ్బతీస్తాయని.. అందుకే సబ్బును పూర్తిగా పక్కన పెట్టేసి మూడు దశాబ్దాలు దాటిందని ఆయన వెల్లడించారు.
చెమట వాసన అనేది నేటి తరం యువతకు పెద్ద తలనొప్పి. కానీ మంతెన గారు మాత్రం తన శరీరానికి చెమట వాసన రాదని గట్టిగా చెబుతున్నారు. దీనికోసం ఆయన ఒక టెస్ట్ కూడా చేశారట. ఆరు నెలల పాటు ఉతకని సాక్సులను వాడి చూసినా ఎటువంటి కంపు రాలేదని చెప్పారు. పది రోజుల పాటు వరుసగా ఒకే జత బట్టలు వాడినా ఇబ్బంది కలగలేదని ఆయన చెప్పిన తీరు అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
ఈ విధమైన నియమాలు పాటించడం వల్ల కలిగే ఫలితాల గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. గత 35 ఏళ్లలో తనకు ఒక్కసారి కూడా తలనొప్పి రాలేదని.. కనీసం వాంతులు లేదా లూజ్ మోషన్స్ లాంటి చిన్న సమస్యలు కూడా దరిచేరలేదని స్పష్టం చేశారు. సమాజానికి ఒక హెల్దీ బాడీ ఎలా ఉంటుందో చూపించడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. న్యాచురల్ ఫుడ్, ప్రకృతికి దగ్గరగా ఉంటే హాస్పిటల్స్ అవసరమే ఉండదనేది ఆయన సందేశం ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates