వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

Mana Shankara Vara Prasad Garu

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా సందడిగా ఉన్నాయి. అయితే కథ పరంగా ఉన్న కొన్ని పాయింట్లను తీసుకుని వాటికి పాత సినిమాలతో ముడిపెడుతున్న ట్రెండ్ ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

అదేంటంటే పిల్లలు దూరమైన హీరో వాళ్ళ కోసం పరితపించి భార్యకు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేయడం గతంలో అజిత్ విశ్వాసం, వెంకటేష్ తులసిలో చూశాం. ఇప్పుడు వరప్రసాద్ లోనూ ఈ ఎపిసోడ్ ఉంది. కాకతాళీయంగా మూడింట్లో హీరోయిన్ నయనతార కావడం గమనించాల్సిన విషయం.

వినగానే నిజమే అనిపించినా ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ కోణాలు చూడాలి. మగధీరలో పూర్వ జన్మలు గుర్తుకు రావడాన్ని మూగ మనసులు నుంచి తీసుకున్నారంటే దానికి ఏం చెప్పగలం. దానికన్నా ముందు జానకి రాముడులోనూ ఈ తరహా ట్రీట్ మెంట్ చూడొచ్చు. విక్రమార్కుడులో విలన్ కొడుకుని చంపే ఎపిసోడ్ వైజయంతి ఐపిఎస్ అనే పాత మూవీలో ఉంటుంది.

చిరంజీవి డాడీలో పాప సెంటిమెంట్ ని మన శంకరవరప్రసాద్ గారులో పాజిటివ్ గా మార్చడం రావిపూడి ఇంటెలిజెన్స్ కి నిదర్శనం. అంతెందుకు సంక్రాంతికి వస్తున్నాంలో భార్య, ప్రియురాలు మధ్య నలిగిపోయే హీరో పాత్రే ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తిలో ఉంది.

భగవంత్ కేసరిలో తనకు సంబంధం లేని అమ్మాయిని గొప్ప స్థితికి తీసుకెళ్లే బాలయ్య తరహా క్యారెక్టర్ అశ్వినిలో భానుచందర్ ముప్పై సంవత్సరాల క్రితమే చేశారు. ఇలా చెప్పుకుంటూ వందల ఉదాహరణలు వస్తాయి కానీ ఫైనల్ గా కంటెంట్ ఆడియన్స్ కి నచ్చిందా లేదానేదే కీలకం.

అది కనెక్ట్ అయితే చాలు ఇంతకు ముందు చూశామా లేదా అనేది జనాలు పట్టించుకోరు. దానికి నిదర్శనమే మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు. మాస్, ఫ్యామిలీ పల్స్ లో పిహెచ్ది చేసిన అనిల్ రావిపూడికి ఈ పోలికలతో పెద్దగా ఫరక్ పడదు కానీ రెండేళ్ల మెగాభిమానుల నిరీక్షణకు తెరదించుతూ హిట్టివ్వడం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.