స్టార్స్ అఫ్ ది డే – రన్బీర్ చైతు ప్రభాస్

డిసెంబర్ 1 గ్రాండ్ గా మొదలైపోయింది. గత కొన్ని వారాలుగా సరైన థియేటర్ ప్లస్ ఓటిటి కంటెంట్ లేక ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కు ‘యానిమల్’ ఫీవర్ వారం ముందు నుంచే అంటుకుంది. దానికి తగ్గట్టే తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. ఒక రన్బీర్ కపూర్ డబ్బింగ్ మూవీకి ఉదయం ఆరు గంటలకే బెనిఫిట్ షోలు వేయడం సందీప్ వంగా సంభవం అని చెప్పొచ్చు. రివ్యూలు మరికొన్ని నిమిషాల్లో ప్రత్యక్షం కాబోతుండగా అభిమానులు మాత్రం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల మ్యాడ్ నెస్ కి సిద్ధమైపోయి సినిమా హాళ్లకు క్యూ కట్టేస్తున్నారు.

ఇక నాగ చైతన్య డిజిటల్ డెబ్యూ ‘దూత’ నిన్న రాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యాన్స్ ఉండబట్టలేక ఏకబికిన చూసేసి ఉంటారు కానీ కామన్ ఆడియన్స్ కి రిలీజ్ డేట్ ఇవాళ కాబట్టి మెల్లగా ఎపిసోడ్ల వారిగా చూస్తారు. ప్రాధమికంగా ఉన్న ఫీడ్ బ్యాక్ అయితే చాలా పాజిటివ్ గా ఉంది కానీ ఫైనల్ ఏంటనేది వేచి చూడాలి. ఈ రెండు ఒక ఎత్తు అయితే ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ కోసం బయ్యర్లు, ప్రేక్షకులు, ఇతర నిర్మాతలు ఒకరేమిటి అందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. కాసిన్ని పోస్టర్లు, హీరో లేని టీజర్ తప్ప ఇప్పటిదాకా ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి మెటీరియల్ బయటికి రాలేదు.

అందుకే సలార్ మీద అంచనాలు మాములుగా లేవు. సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ లో ఎలాంటి జాప్యం ఉండకూడదని అభిమానులు దేవుళ్లను వేడుకుంటున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకో ఇరవై ఒక్క రోజులే ఉన్న నేపథ్యంలో సలార్ ప్రమోషన్లు పీక్స్ కు చేరుకోవాల్సి ఉంది. నిన్నటి దాకా తెలంగాణ ఎన్నికల హడావిడి, ఎగ్ఝిట్ పోల్స్ తో గడిపిన జనాలు మెల్లగా ఎంటర్ టైన్మెంట్ ప్రపంచంలోకి వస్తున్నారు. రావడమే ఆలస్యం రన్బీర్ కపూర్, నాగ చైతన్య, ప్రభాస్ లు ఇలా ముగ్గురు గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కన్నా కావలసింది వాళ్లకు ఏముంటుంది.