పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అదే. అలాంటి హీరో తర్వాతి రెండు చిత్రాలతో దారుణమైన పరాజయాలను అందుకున్నాడు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో పాటు ‘లాల్ సింగ్ చడ్డా’ ఊహించని డిజాస్టర్లు అయ్యాయి. ముఖ్యంగా ‘లాల్ సింగ్ చడ్డా’ అనుభవం ఆమిర్ ఖాన్‌ను షాక్‌కు గురి చేసింది.
దీంతో కెరీర్లో కొంచెం గ్యాప్ తీసుకుని ‘సితారే జమీన్ పర్’ సినిమా చేశాడు ఆమిర్. ఈ చిత్రం కూడా విడుదలకు ముందు నెగెటివిటీ ఎదుర్కొంది. కానీ ఆమిర్ కొంచెం స్ట్రాటజిగ్గా వ్యవహరించి ఈ సినిమాతో సత్ఫలితం రాబట్టాడు. టాక్ కొంచెం డివైడ్‌గా ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబట్టింది. పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమాకు థియేటర్ దగ్గరే పెట్టుబడి దాదాపుగా రికవర్ అయిపోయింది.
ఆ తర్వాత ఆమిర్ ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్‌కు ఇవ్వలేదు. మొదట్నుంచి ఓటీటీల పట్ల వ్యతిరేకత చూపిస్తున్న ఆమిర్.. ఈ చిత్రాన్ని ఎనిమిది వారాల విండో తర్వాత నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. అక్కడ కూడా రెంట్ పద్ధతిలోనే సినిమాను వీక్షించే అవకాశమిచ్చాడు. దీన్నుంచి ఆమిర్ మంచి ఆదాయం రాబట్టుకున్నాడు.
ఇలా ఆరు నెలల పాటు యూట్యూబ్‌లో ఉంచిన సినిమాను ఇప్పుడు సోనీ లివ్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నాడట ఆమిర్. ఇప్పుడు సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు ఉచితంగా ఆమిర్ మూవీని చూడొచ్చు.
లేటుగా స్ట్రీమింగ్‌కు ఇవ్వడం వల్ల రేటు తగ్గొచ్చు. కానీ ఇప్పటికే యూట్యూబ్ ద్వారా ఆమిర్ మంచి లాభాలు అందుకున్నాడు. ఇప్పుడు సోనీ లివ్ ద్వారా వచ్చే ఆదాయం అదనపు లాభం అన్నమాట. మొత్తంగా ఆయనీ సినిమాతో భారీ లాభమే అందుకున్నాడన్నది బాలీవుడ్ వర్గాల టాక్. స్పానిష్ మూవీ ‘ఛాంపియన్స్’ ఆధారంగా ఆర్.ఎస్.ప్రసన్న రూపొందించిన ఈ చిత్రాన్ని ఆమిర్ తన సొంత బేనర్లో ప్రొడ్యూస్ చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates