నానికి ప్రశ్నలు – నిర్మాతల సమాధానాలు

ఇవాళ జరిగిన హాయ్ నాన్న ప్రెస్ మీట్ లో కాసింత వాడి వేడి చర్చలే జరిగాయి. ముఖ్యంగా జెర్సి, శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాలు బ్రేక్ ఈవెన్ అందుకోలేదన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు నాని కాసింత గట్టిగానే సమాధానం చెప్పడం వైరలయ్యింది. సదరు ప్రొడ్యూసర్లను లెక్కలు అడగవచ్చని, ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోయినా తనకు ఆ విషయాలు తెలుసని, అంటే సుందరానికి గురించి అయితే ఏదో అనుకునేవాడిని తప్పించి లాభాలు తీసుకొచ్చిన హిట్ మూవీస్ ని ఇలా తప్పుగా అడగటం సబబు కాదని సమాధానమిచ్చాడు. ఈ కామెంట్లకు మద్దతుగా నిర్మాతలు ట్విట్టర్ లో స్పందించారు.

జెర్సీ ప్రొడ్యూసర్ నాగవంశీ తాము ఆ సినిమా తీసినందుకు ఎంతో గర్వంగా ఉన్నామని, లాభాలే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చాయని నానిని సమర్థిస్తూ ట్వీట్ చేయడం విశేషం. శ్యామ్ సింగ రాయ్ నిర్మించిన వెంకట్ బోయినపల్లి సైతం ఇదే తరహా బదులు చెబుతూ మళ్ళీ మళ్ళీ ఇలాంటి గొప్ప చిత్రాలు తీసే అవకాశం కోసం చూస్తున్నామని కుండ బద్దలు కొట్టారు. నిజానికి ఆ రెండు ఫెయిల్యూర్స్ కాదనేదేది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి రెండు ఏరియాల వసూళ్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ ని పూర్తిగా రికవర్ చేశాయి.

అలాంటప్పుడు ఫ్లాప్ అనే ప్రస్తావనే రాదు. వి లాంటి డిజాస్టర్ గురించి అయితే పర్వాలేదు కానీ సక్సెస్ అయిన వాటిని ఇలా ప్రస్తావించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్సనల్ ఇంటర్వ్యూలో ఇలాంటివి ఎన్ని అయినా అడగొచ్చు. తప్పేం లేదు. కానీ హాయ్ నాన్నకు ఏ మాత్రం సంబంధం లేని వాటిని అదే పనిగా చర్చకు తీసుకొస్తే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకున్న హాయ్ నాన్న డిసెంబర్ 7 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే, టీజర్, విడుదల తేదీ ప్రకటించడంతో పాటు ఇవాళ్టి నుంచి ఈ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేయబోతున్నారు.