బాహుబలిలో కట్టప్ప పాత్రతో ఇండియా అనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్. అంతకంటే ముందు, తర్వాత కూడా ఆయన తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఇండియాలో బిజీయెస్ట్ యాక్టర్లలో ఆయనొకడు. తమిళంలోనే కాక తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో ఆయన సినిమాలు చేస్తున్నారు. ఐతే తనకు తమిళం తప్ప ఏ భాషా తెలియదని..అయినా అన్ని భాషల్లో మేనేజ్ చేయగలుగుతున్నానంటూ.. తన సక్సెస్ సీక్రెట్ ఒకటి బయటపెట్టాడు కట్టప్ప.
సత్యరాజ్ కీలక పాత్ర పోషించిన వెపన్ అనే సినిమా ప్రమోషన్లలో భాగంగా సత్యరాజ్ హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ సందర్భంగా ఆయన తన మల్టీలాంగ్వేజ్ యాక్టింగ్ కిటుకు గురించి చెప్పుకొచ్చాడు. ప్రపంచంలో ఏ భాషకైనా లిప్ సింక్ అనేది ఒకే రకంగా ఉంటుందని.. ఆ గుట్టు పట్టుకుంటే ఏ భాషలో అయినా నటించగలమని సత్యరాజ్ పేర్కొన్నాడు. అన్ని భాషలకూ కామన్‌గా ఉండే లిప్ సింక్ మూమెంట్స్ మీద తనకు అవగాహన ఉందని.. కాబట్టి ఎవరు ఏ భాషలో ప్రాంప్టింగ్ ఇచ్చినా తాను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లు లిప్ సింక్ ఇస్తానని సత్యరాజ్ తెలిపాడు. ఈ సీక్రెట్ తెలిస్తే కజకిస్థాన్, వియత్నాం భాషల్లో కూడా నటించవచ్చని ఆయన అన్నాడు.
తనకు తెలుగు రాదని.. అయినా ఇక్కడ చాలా సినిమాలు చేశానంటే లిప్ సింక్ సమస్య కాకపోవడం వల్లే అని సత్యరాజ్ తెలిపాడు. నిజానికి తాను తమిళేతర భాషలు నేర్చుకోకపోవడానికి కూడా ఒక కారణం ఉందని.. తెలుగు సినిమాలు చేస్తున్నపుడు ఇక్కడి నటులైనా.. మలయాళంలో నటిస్తున్నపుడు అక్కడి వాళ్లయినా తనతో తమిళంలోనే మాట్లాడతారని.. అందు వల్ల తాను ఈ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం రాలేదని.. లేకుంటే ఎప్పుడో ఈ భాషలు వచ్చేసేవని సత్యరాజ్ తెలిపాడు. తనకు భాష రాకపోయినా తెలుగులో చాలా సినిమాలు చేశానని.. ఇక్కడి ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారని సత్యరాజ్ వ్యాఖ్యానించాడు.