ఖ‌మేనీని ఎందుకు చంపేశారు?.. ప్ర‌పంచం శోధించిన ప్ర‌శ్న‌!

ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌(ఒక‌ర‌కంగా ప్ర‌ధాన‌మంత్రి) అయ‌తొల్లా అలీ ఖ‌మేనీని అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జ‌రిపిన దాడుల్లో హ‌తం చేశాయి. అయితే.. అస‌లు ఖ‌మేనీ చేసిన త‌ప్పేంటి? ఎందుకు ఆయ‌న‌ను హ‌త మార్చారు? అమెరికాకు-ఇరాన్‌కు మ‌ధ్య వివాదం ఏంటి? ఒక‌ప్పుడు ఒకే కంచం, ఒకే మంచం అన్న ట్టుగా ఉన్న ఇరాన్‌-ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం ఎందుకు చోటు చేసుకుంది? ఇవీ.. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు గూగుల్ లో శోధించిన ప్ర‌శ్న‌లు. వీటికి స‌మాధానాలు ఏంటి? ఏం జ‌రిగింది?.

తొలి వివాదం: ఇస్లామిక్ ఉద్య‌మం

ఇరాన్ స‌హా ప‌శ్చిమాసియాలోని ప‌లు దేశాలు.. ఇస్లామిక్ ఉద్య‌మాన్ని ప్రారంభించాయి. అంటే.. ఇస్లాంను అనుస‌రించే వారు మాత్ర‌మే త‌మకు మిత్రుల‌ని, ఆ పౌరులు మాత్ర‌మే త‌మ దేశాల్లో స్థిర‌ప‌డాల‌ని ఈ ఉద్య‌మం ప్ర‌ధాన ఉద్దేశం. దీనిని ఇరాన్ లీడ్ చేసింది. అయితే.. అమెరికా స‌హా.. ఇత‌ర దేశాలు దీనిని వ్య‌తిరేకించాయి. దీంతో 1970ల‌లోనే ఇరాన్ కేంద్రంగా తొలి యుద్ధం మొద‌లైంది. అప్ప‌ట్లో ఇరాన్ ఈ దాడుల‌ను స‌మ‌ర్థవంతంగా అడ్డుకుంది. ఈ క్ర‌మంలో ప‌లు దేశాల దౌత్య అధికారుల‌ను త‌మకు బందీలుగా చేసుకుంది.

మ‌లి వివాదం: అధికారుల విడుద‌ల‌..

ఇరాన్ అధీనంలో ఉన్న అధికారుల‌ను విడిపించేందుకు అమెరికా యుద్ధం మొదలు పెట్టింది. అయినా.. విజ‌యం ద‌క్కించుకోక‌పోగా.. అనేక మంది సైనికులను కోల్పోయింది. ఇక‌, అప్ప‌టి నుంచి అమెరికాకు-ఇరాన్‌కు మ‌ధ్య అనేక విష‌యాల్లో పొర‌పొచ్చాలు రాజుకున్నాయి.

మిత్రుడే శ‌త్రువైన వేళ‌!

కొన్ని ద‌శాబ్దాల పాటు ఇజ్రాయెల్-ఇర‌న్ దేశాలు క‌లిసే ఉన్నాయి. మంచి భాగ‌స్వామ్య మిత్ర‌త్వం కూడా ఉంది. అయితే.. ఇరాన్ దే పైచేయి కావ‌డంతో ఇజ్రాయెల్ కూడా కొన్ని ద‌శాబ్దాల పాటు వెనక్కి త‌గ్గింది. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన అమెరికా.. ఇజ్రాయెల్‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు 40 ఏళ్ల కింద‌టే నెమ్మ‌దిగా పావులు క‌దిపారు. ఇజ్రాయెల్‌కు అండ‌గా ఉండ‌డం, ఆర్థికంగా ఆదుకోవ‌డం వంటివి ప్రారంభించారు. ఈ విష‌యం తెలిసిన ఇరాన్‌.. ఇజ్రాయెల్‌ను దూరం పెడుతూ వ‌చ్చింది. ఇది ఈ రెండు దేశాల మ‌ధ్య వివాదాన్ని పెంచి పోషించింది.

అమెరికా ల‌క్ష్యం ఏంటి?

ఇరాన్ విష‌యంలో అమెరికా ల‌క్ష్యం కీల‌కం. ఇరాన్‌లోని చ‌మురు, అణుశుద్ధి కార్య‌క్ర‌మాల‌పై త‌మ గుత్తాధిప‌త్యం కోసం అగ్ర‌రాజ్యం ఆది నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ, ఇరాన్ దీనిని ఒప్పుకోలేదు. ఇది రానురాను జ‌ఠిలంగా మారుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ట్రంప్ తొలిసారి అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత‌.. ఇరాన్‌పై అనేక ఆంక్ష‌లు విధిస్తూ వ‌చ్చారు. ఫ‌లితంగా ఆత్మ‌నిర్భ‌ర‌త కోసం.. ఇరాన్ సైతం అమెరికాను ఢీ అంటే ఢీ అనే ప‌రిస్థితికి ఎదిగింది.

ఇజ్రాయెల్‌ను ఎక్క‌డ ఆక్ర‌మిస్తారోన‌ని..

అమెరికాతో చెలిమి చేస్తున్న ఇజ్రాయెల్‌ను ఇరాన్ తొలుత టార్గెట్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే త‌మకు మ‌ద్ద‌తు గా ఉన్న హౌతీ స‌హా ఇత‌ర చిన్న చిన్న ఇస్లామిక్‌ దేశాల‌లోని సైన్యాన్ని ఇరాన్ రెచ్చగొట్టి ఇజ్రాయెల్‌పై దాడులు చేసేలా చేసింది. అయితే.. ఇజ్రాయెల్ వాద‌న భిన్నంగా ఉంది. అస‌లు త‌మ భూభాగాన్ని ఆక్ర‌మించాల‌న్న‌దే ఇరాన్ ల‌క్ష్య‌మ‌ని.. త‌మ సార్వ‌భౌమాధికారిన్ని వ‌దులుకునేది లేద‌ని చెబుతూ వ‌చ్చింది. దీనికి అమెరికా కూడా జ‌త క‌ల‌వ‌డంతోనే అస‌లు వివాదం మ‌రింత పెరిగింది.

2020ల నుంచి ..

గ‌త ఆరేళ్లుగా అమెరికా మ‌రింత‌గా ఇరాన్‌ను టార్గెట్ చేసుకుంది. చ‌మురు స‌హా అణు కార్య‌క్ర‌మాల‌పై ఆంక్ష‌లు విధిస్తూ వ‌చ్చింది. ఇరాన్ నుంచి చ‌మురు కొనుగోలు చేయొద్ద‌ని ప్ర‌పంచ దేశాల‌కు ఆదేశాలు జారీచేసింది. అయితే.. గ‌ల్ఫ్ దేశాల‌న్నీ.. ఇరాన్‌కు అనుకూలంగా ఉండడంతో ఇది సాకారం కాలేదు. దీనికి తోడు ఖ‌మేనీ.. కొర‌క‌రాని కొయ్య‌లా అమెరికాకు సవాల్ రువ్వారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది మ‌రింత‌గా ఇరాన్ ఇబ్బందుల్లో కూరుకుపోయేలా అమెరికా వ్య‌వ‌హ‌రించింది. ఫ‌లితంగా ఇరాన్ మార‌కం విలువ ప‌డిపోయి ఆర్థిక న‌ష్టాలు చ‌విచూసింది. ఇది ప్ర‌జ‌ల‌ను ఆగ్ర‌హానికి గురి చేసింది. దీనిని అణిచి వేయ‌డం ద్వారా ఇరాన్ అధినేత ఖ‌మేనీ ప్ర‌జ‌ల సానుభూతిని కోల్పోయారు.

మిత్ర‌ల‌పైనా దండెత్తి!

తాజా ఉదంతానికి వ‌స్తే.. త‌న‌కు మిత్ర దేశాలుగా ఉన్న గ‌ల్ఫ్ కంట్రీస్ స‌హా.. మ‌రింత మంచి మిత్రుడుగా ఉన్న పాకిస్థాన్ కూడా ఇరాన్‌కు దూర‌మైంది. ఈ క్ర‌మంలో ఇరాన్ ఒక అడుగు వెన‌క్కి వేసి ఉంటే ఈ ప‌రిణామాలు చోటు చేసుకునేవికావు. కానీ.. చ‌ర్చ‌ల‌కు ఒమ‌న్ దేశం మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించినా.. ఈ చ‌ర్చ‌లు ఫ‌లించే క్ర‌మంలోనే ఖ‌మేనీ.. మ‌రోసారి అణు ప‌రీక్ష‌ల‌కు రెడీ అయ్యారు. ఇది అమెరికాకు మ‌రింత మండేలా చేసింది. ఫ‌లితంగా తాను వెనుక ఉండి.. ఇజ్రాయెల్‌ను ప్రోత్స‌హించి.. త‌ర్వాత నేరుగా త‌న విశ్వ‌రూపం చూపించింది. ఖ‌చ్చిత‌మైన ల‌క్ష్యాల‌తో ఖ‌మేనీని అంతం చేయ‌డం గ‌మ‌నార్హం.

అమెరికాకు లాభం ఏంటి?

1) ఇరాన్‌లో త‌న‌కు అనుకూల‌మైన ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌న్న విశ్వాసం.

2) ఇరాన్ చ‌మురుపై అమెరికాకు గుత్తాధిప‌త్యం ల‌భించే అవకాశం.

3) అణు ప‌రీక్ష‌లు, అణ్వాయుధాల విష‌యంలో త‌న‌ను మించ‌కుండా చూసుకునే ఎత్తుగ‌డ‌.

4) ఇరాన్ వాణిజ్యంలోకి నేరుగా ప్ర‌వేశించే అవ‌కాశం.

ఇజ్రాయెల్‌కు లాభం ఇదీ..

1) ప‌క్క‌లో బ‌ల్లెం మాదిరిగా ఉన్న ఇరాన్ బెడ‌ద త‌గ్గ‌డం.

2) ఇరాన్ హెచ్చ‌రిక‌ల‌ను ఇక‌పై ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డం.

3) ఇస్లామిక్ దేశంపై ప‌ట్టు సాధించ‌డం.

4) త‌న భూభాగాన్ని రక్షించుకునే ప్ర‌య‌త్నం.