బామ్మ భుజాల మీద సినిమాను నడిపించారు

తెలుగులో అయినా ఒకటి రెండు హిట్లు పడుతున్నాయి కానీ తమిళ బాక్సాఫీస్ మరీ అన్యాయంగా సరైన సినిమాలు లేక అలో లక్ష్మణా అంటోంది. సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన పరాశక్తి డిజాస్టర్ కావడం, జన నాయకుడు వాయిదా పడటం అక్కడి ఎగ్జిబిషన్ రంగాన్ని బాగా దెబ్బ కొట్టింది. అందుకే తాజాగా విడుదలైన తాయ్ కిళవి మీద భారీ ఆశలు పెట్టుకున్నారు.

శివ కార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడంతో బిజినెస్ పరంగా క్రేజ్ వచ్చింది. దానికి తోడు టైటిల్ రోల్ పోషించిన రాధికా శరత్ కుమార్ నటన గురించి ట్రైలర్ లో ముందే శాంపిల్స్ చూపించడంతో మాస్ ఆడియన్స్ ఆసక్తి పెంచుకున్నారు.  

కథ విషయానికి వస్తే పక్కా పల్లెటూరి మాస్ డ్రామా ఈ తాయ్ కిళవి. పవునుత్తాయి (రాధికా శరత్ కుమార్) అనే బామ్మకు కోపం ఎక్కువ. డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడ్డం, తేడా వస్తే తుక్కు రేపడం ఆవిడ స్టైల్. బాధ్యత లేని ముగ్గురు కొడుకులను బయటికి పంపించి ఒంటరిగా ఉంటుంది.

ఆమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఊళ్ళో మొదలవుతుంది. హఠాత్తుగా పక్షవాతం వచ్చి మాట పడిపోయాక, వెళ్ళిపోయిన సంతానం తిరిగి ఆమె దగ్గరకు చేరుకుంటారు. సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది పవునుత్తాయి. చివరికి ఏం జరిగింది, కథ కంచికి చేరిందా లేదానేది అసలు స్టోరీ.

పక్కా తమిళనాడు నేటివిటీలో రూపొందిన తాయ్ కిళవి ఆద్యంతం రాధికా శరత్ కుమార్ అద్భుతమైన నటన మీద వెళ్ళిపోతుంది. సెటిల్డ్ కామెడీ,  మంచి ఎమోషన్స్ తో దర్శకుడు శివకుమార్ మురుగేషన్ పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. సెకండాఫ్ లో ఎమోషన్స్ కాస్త ఎక్కువైనప్పటికీ వాటిని హ్యాండిల్ చేసిన తీరు బాగుంది.

కొంత ల్యాగ్ ని భరించగలిగితే తాయ్ కిళవి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. కాకపోతే మన తెలుగు జనాలకు కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. అందుకే డబ్బింగ్ లాంటి నిర్ణయం ప్రస్తుతానికి తీసుకోలేదు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా టాలీవుడ్ జనాలకు పరిచయమున్న ఆర్టిస్టులు ఇందులో లేరు.