పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ ‘తెరి’కి రీమేక్ అని ఎఫ్పట్నుంచో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని చాన్నాళ్ల పాటు దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు టీం ఖండించలేదు.
కానీ గత ఏడాది చిత్రీకరణ పూర్తవుతున్న దశలో ‘కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్’ అని పోస్టర్ మీద పడడంతో ఇది రీమేక్ కాదని అర్థమైంది. అయినా సరే.. చాలామంది ఇది రీమేకే అని వాదిస్తూ వచ్చారు. హరీష్ శంకర్ మరోసారి తాను చేస్తున్నది రీమేక్ మూవీ కాదని స్వయంగా స్పష్టం చేసినా.. ఆ కొందరి తీరు మారలేదు. దీంతో ఇప్పుడు మరోసారి హరీష్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదనే విషయాన్ని బల్లగుద్ది చెప్పాడు.
తాను ‘గబ్బర్ సింగ్’లో పెట్టిన అంత్యాక్షరి ఎపిసోడ్‌ను ‘తెరి’లో వాడుకున్నారని.. అలాంటి సినిమాను తాను ఎందుకు రీమేక్ చేస్తానని హరీష్ శంకర్ ప్రశ్నించాడు. పోలీస్ కథలు అన్నింట్లోనూ హీరో.. సమాజానికి హాని కలిగించే శక్తుల మీద పోరాడడం కామన్ అని.. గబ్బర్ సింగ్, తెరి, ఇంకా చాలా సినిమాల్లో ఇలాగే ఉంటుందని.. ఆ రకంగా ‘తెరి’తో పోలిక ఉంటుందే తప్ప.. దానికి తన సినిమాకు ఏ పోలికా లేదని హరీష్ స్పష్టం చేశాడు.
తాను ‘దబంగ్’ ఆధారంగా ‘గబ్బర్ సింగ్’ తీసినపుడు.. ఎన్నో మార్పులు చేశానని.. అందుకే ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రీమేక్‌లు వచ్చినా సరే, ‘మార్పులు’ అని టైటిల్ కార్డ్‌లో వేసింది తాను ఒక్కడిని మాత్రమే అని.. అది రాజమౌళికి కూడా విపరీతంగా నచ్చి, సినిమాలో అక్కడి నుంచే తాను నవ్వడం మొదలుపెట్టానని తనతో అన్నట్లు హరీష్ గుర్తు చేసుకున్నాడు.
ఇక ‘భవదీయుడు భగత్ సింగ్’ కాస్తా ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మారడం గురించి హరీష్ మాట్లాడుతూ.. ముందు కాలేజీ నేపథ్యంలో కొంచెం క్లాస్ కథ చేయాలని అనుకున్నామని.. ఆ రకంగా కథ తయారు చేశామని.. కానీ అందులో మాస్ ఎలిమెంట్స్ పెట్టడం కష్టమైందని హరీష్ తెలిపాడు. కొందరు ‘భవదీయుడు’ అంటే ఏంటి అని కూడా అడిగారని.. టైటిలే అర్థం కానపుడు సినిమా ఏం అర్థమవుతుందని అనిపించిందని.. అందుకే టైటిలే కాదు, కథ కూడా మార్చేశామని.. ‘గబ్బర్ సింగ్’ స్టయిల్లోనే ఇంకో మాస్ కథ రెడీ చేసి సినిమా తీశామని హరీష్ వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates