‘రాజాసాబ్’ తర్వాత గాయబ్

ప్రభాస్‌తో సినిమా అంటే అభిమానులే కాదు.. అందులో భాగమైన వాళ్లు కూడా చాలా ఆశలు పెట్టుకుంటారు. పాన్ ఇండియా స్థాయిలో తమకు పేరొస్తుందని.. అవకాశాలు వరుస కట్టేస్తాయని నటీనటులు, సాంకేతిక నిపుణులు భావిస్తారు. ‘రాజాసాబ్’ మీద కూడా అందరూ అలాంటి ఆశలే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోవడం, తీవ్ర విమర్శలు ఎదుర్కొని చివరికి సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్‌గా మారిపోవడంతో అందరి ఆశలూ అడియాసలయ్యాయి.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ నష్టాన్ని ఎదుర్కొని.. ప్రొడక్షన్ వేగం తగ్గించేశారు. దర్శకుడు మారుతికి ఇంకో పెద్ద సినిమా దక్కే అవకాశం లేక చిన్న చిత్రంతో అడ్జస్ట్ అవుతున్నాడు. ఇక ‘రాజాసాబ్’తో తమ కెరీర్లు మారిపోతాయని ఆశించిన హీరోయిన్లు ముగ్గురు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచే గాయబ్ అయిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి.

గత ఏడాది ‘హరిహర వీరమల్లు’తో కంగుతిన్న నిధి అగర్వాల్‌కు ‘రాజాసాబ్’తో మరో షాక్ తగలడంతో ఆమె మీద డిజాస్టర్ హీరోయిన్ అని ముద్ర పడిపోయింది. ‘రాజాసాబ్’ రిలీజ్‌కు ముందు మూడు సినిమాల్లో ఛాన్స్ వచ్చిందని, ఈ మూవీ రిలీజయ్యాక వాటి వివరాలు వెల్లడిస్తానని చెప్పింది నిధి. కానీ ‘రాజాసాబ్’ విడుదలై రెండు నెలలు గడుస్తున్నా ఆ కబుర్లేవీ బయటికి రాలేదు.

ఇక ఎప్పుడో తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టాల్సిన మాళవిక మోహనన్ చివరికి ‘రాజాసాబ్’ లాంటి పెద్ద సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె పెద్దగా ప్రభావం చూపకపోవడంతో కొత్త ఛాన్సులు వస్తున్న సంకేతాలేమీ కనిపించడం లేదు.

మూడో హీరోయిన్ రిద్ధి కుమార్ గురించి అయితే అసలు డిస్కషనే లేదు. సినిమాలో తన పాత్ర, నటన తేలిపోవడంతో తనకు మైనస్ మార్కులే పడ్డాయి. ముగ్గురూ పోటీ పడి గ్లామర్ విందు చేసినా.. అది సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఫలితాన్ని మార్చలేదు. ఇప్పుడు ‘రాజాసాబ్’ హీరోయిన్లు ముగ్గురూ అవకాశాలు లేక ఖాళీ అయిపోయిన పరిస్థితే కనిపిస్తోంది.