ఓజీ, ఉస్తాద్.. పవన్ ప్రాధాన్యం దేనికి?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టంతా రాజకీయాల మీదే ఉన్నట్లు కనిపిస్తోంది. నెలన్నర కిందటే పవన్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని వారాహి విజయయాత్రను మొదలుపెట్టాడు. రెండు దశల్లో ఆ యాత్ర పూర్తి అయ్యాక విరామం తీసుకున్నాడు. ఇక మంగళగిరిలో యాత్ర పున:ప్రారంభం కాబోతోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న అంచనాతో తాను నటిస్తున్న సినిమాలను ఎక్కడికక్కడ ఆపేయమని చెప్పాడని.. మళ్లీ ఎన్నికల తర్వాతే షూటింగ్స్ అని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

కానీ ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయిప్పుడు. దీంతో తన దర్శకులు, నిర్మాతలు ఇబ్బంది పడకుండా అప్పుడప్పుడూ కొంత ఖాళీ చేసుకుని షూటింగ్‌లో పాల్గొనాలని పవన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కోసం ఇటు ‘ఓజీ’, అటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్స్ ఎదురు చూస్తున్నాయి.

పవన్ ప్రయారిటీ ‘ఓజీ’కే అని.. డిసెంబరులో ఆ సినిమాను రిలీజ్ చేసేలా.. కొన్ని రోజులు డేట్లు కేటాయించి తనతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ పూర్తి చేస్తాడని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడేమో ఉన్నట్లుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరపైకి వచ్చింది. తాజాగా హరీష్ శంకర్.. పవన్‌ను కలిసి షూట్‌ గురించి మాట్లాడాడని.. 30 రోజులు కాల్ షీట్స్ ఇవ్వడానికి ఒప్పుకున్న పవన్.. ఆ దిశగా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలని సూచించాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతే కాక వచ్చే సంక్రాంతికి ‘ఉస్తాద్..’ రిలీజ్ కూడా అని జోరుగా వార్తలు వచ్చాయి.

దీంతో ‘ఓజీ’ సంగతేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. నిజానికి ఆ సినిమానే ఎక్కువ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ ఒక రెండు వారాలు డేట్లు ఇచ్చినా ఆ సినిమా రెడీ అయిపోతుంది. డిసెంబర్లో రిలీజ్ చేసుకోవచ్చు. ‘ఉస్తాద్..’ కోసమైతే ఎక్కువ సమయం కేటాయించాలి. మరి పవన్ ప్రయారిటీ దేనికి అన్నది అర్థం కావడం లేదు. ఈ రెండు చిత్రాలనూ పూర్తి చేసేంత టైం పవన్ దగ్గర ఉందా.. ఆ పని పెట్టుకుంటే రాజకీయంగా నష్టం కదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.