పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం ‘బ్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన ప్రసంగంలో.. అందరినీ ఆశ్చర్యపరిచింది.. చర్చనీయాంశంగా మారింది.. తమిళ సినీ పరిశ్రమ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే. తమిళ సినిమాలకు సబంధించి ఏవో షరతులు పెట్టారని విన్నానంటూ పవన్ వాటిని తప్పుబట్టారు. ఇలా ఒక పరిధి పెట్టుకుంటే ఏ పరిశ్రమా ఎదగలేదని.. తెలుగు పరిశ్రమ అందరినీ అక్కున చేర్చుకుంది కాబట్టే ఈ రోజు ప్రపంచ స్థాయికి ఎదిగిందని.. ఇలాగే విశాల దృక్పథంతో ఆలోచిస్తే కోలీవుడ్ నుంచి కూడా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు వస్తాయని పవన్ పేర్కొన్నాడు.
దీంతో ఇంతకీ కోలీవుడ్లో పెట్టిన ఆ షరతులేంటి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రోజా భర్త సెల్వమణి నేతృత్వంలోని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సి) పెట్టిన ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. తమిళ సినిమాల్లో తమిళ ఆర్టిస్టులను మాత్రమే తీసుకోవాలి. తమిళ చిత్రాల షూటింగ్స్ అన్నీ రాష్ట్ర పరిధిలోనే జరగాలి. అత్యవసరం అయితే తప్ప తమిళనాడు, దేశం దాటి వెళ్లకూడదు. ఒక సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్లో పూర్తి కాకపోతే నిర్మాత ఫిర్యాదు చేయొచ్చు.
దర్శకుడే కథకుడు అయిన పక్షంలో ఆ కథకు సంబంధించి వివాదాలన్నీ అతడి బాధ్యతే. నిర్మాతకు దీంతో సంబంధం లేదు. ఈ షరతుల్లో చివరి రెంటి విషయంలో అభ్యంతరాలు లేవు కానీ.. తమిళ సినిమాల్లో తమిళులనే తీసుకోవాలి, షూటింగ్ తమిళనాడులనే చేయాలనే విషయంలో మాత్రం కోలీవుడ్లోనే వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్నే పవన్ లేవెనత్తి చర్చనీయాంశంగా మార్చాడు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద చర్చే నడుస్తోంది సోషల్ మీడియాలో.