దేశంలో తెలుగు ప్రేక్షకులంత విశాల హృదయం ఎవరికీ ఉండదని చెప్పడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం.. ఇతర భాషా చిత్రాలను మన వాళ్లు ఎలా ఆదరిస్తున్నారో? తమిళం, హిందీ, మలయాళం, కన్నడ.. ఇలా ఏ భాష నుంచైనా సరే.. అనువాద చిత్రాలు వచ్చి అవి బాగున్నాయన్న టాక్ వస్తే అందులో హీరో హీరోయిన్లు ఎవరు.. ఆ సినిమా తీసింది ఎవరు అని పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్లి చూస్తారు. ఇంకే ఇండస్ట్రీలోనూ వేరే భాషా చిత్రాలనూ ఈ స్థాయిలో ఆదరించడం కనిపించదు.
అలాంటి తెలుగు ప్రేక్షకుల గురించి గత ఏడాది ‘పొన్నియన్ సెల్వన్’ రిలీజ్ టైంలో అవాకులు చెవాకులు పేలారు తమిళ జనాలు. అందులో కొందరు ప్రముఖ క్రిటిక్స్ కూడా ఉండడం విశేషం. తాము గర్వకారణంగా భావిస్తున్న సినిమాను తెలుగు ప్రేక్షకులు కించపరుస్తున్నారని.. వారికి టేస్ట్ లేదని పేర్కొంటూ.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు.
కట్ చేస్తే కొన్ని రోజుల్లోనే ‘కాంతార’ సినిమా తెలుగు బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాను నెత్తిన పెట్టుున్నారు మనవాళ్లు. ఆపై ‘లవ్ టుడే’ అనే చిన్న తమిళ చిత్రాన్ని తెలుగులో బాగా ఆదరించారు. ఇలాంటి చిన్న సినిమా తెలుగు నుంచి తమిళంలోకి వెళ్తే అసలు పట్టించుకునేవారా అన్నది సందేహం. ఇక సంక్రాంతికి విజయ్ సినిమా ‘వారసుడు’ కూడా తెలుగులో బాగానే ఆడింది. ఇప్పుడు ధనుష్ సినిమా ‘సార్’కు తెలుగులో వస్తున్న ఆదరణ చూస్తే తమిళ జనాలకు అసలు నోట మాట రాదేమో. తాను తొలిసారి చేసిన తెలుగు చిత్రానికి ఇంతటి ఆదరణ దక్కుతుందని.. తనకు తెలుగు ప్రేక్షకులు ఇలాంటి వెల్కమ్ చెబుతారని ధనుష్ కూడా ఊహించి ఉండడేమో.
ధనుష్ తమిళంలో టాప్ స్టార్లలో ఒకడు. ‘సార్’ సినిమాకు తమిళంలో ఎంత వసూళ్లు వస్తున్నాయో.. తెలుగులో దాదాపు సమానంగా కలెక్షన్లు ఉణ్నాయి. మూడు రోజుల్లో రూ.16 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచిందీ సినిమా. ఈ వసూళ్ల లెక్కలు చూసి తమిళ క్రిటిక్స్‌ను ట్యాగ్ చేసి.. తెలుగు ప్రేక్షకులంటే ఇదీ, ఇప్పుడేమంటారు అంటూ కౌంటర్లు వేస్తున్నారు మన నెటిజన్లు.