ప్ర‌భాస్-హృతిక్ మెగా మ‌ల్టీస్టార‌ర్.. ప్ర‌క‌ట‌నే త‌రువాయి?

బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌తో హిందీ సినిమా తీయాల‌న్న ల‌క్ష్యంతో చాలామంది బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ ఉన్నారు. ప్ర‌భాస్ కూడా ఆస‌క్తితోనే ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నాడు కానీ.. ఆల్రెడీ చేతిలో ఉన్న టాలీవుడ్‌ క‌మిట్మెంట్ల‌ను పూర్తి చేస్తే త‌ప్ప అత‌ను బాలీవుడ్‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. అయితే హృతిక్‌తో క‌లిసి ప్ర‌భాస్ ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడంటూ ప్ర‌భాస్ గురించి ఓ క‌బురు వినిపిస్తోంది కొన్ని రోజులుగా. అది నిజ‌మ‌య్యే రోజు ద‌గ్గ‌ర ప‌డిన‌ట్లుగా ఇప్పుడు బ‌లంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్ చేసిన తాజా ప్ర‌క‌ట‌న ఈ దిశ‌గా చ‌ర్చ‌కు అవ‌కాశ‌మిస్తోంది.

య‌శ్ రాజ్ ఫిలిమ్స్ 50వ వార్షికోత్స‌వం పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో ఇండియాలో అతి పెద్ద స్టార్ల‌యిన ఇద్ద‌రు హీరోల‌తో క‌లిసి ఓ మెగా మ‌ల్టీస్టార‌ర్‌ను అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు మీడియాకు స‌మాచారం అందింది. ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎవ‌రా ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు అనే విష‌యంలో చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌భాస్, హృతిక్‌లే ఆ ఇద్ద‌రు అని బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో ధూమ్‌-4 రావ‌చ్చ‌ని కూడా కొంద‌రు అంటున్నారు. దీనిపై అంత‌కంత‌కూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఒక‌ట్రెండు రోజుల్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య రాయ్ కపూర్ ఈ ప్రాజెక్టు విష‌య‌మై స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలున్నాయి.