స్వీటీ పెళ్లి వార్త.. ఈసారైనా నిజమవుతుందా?

ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత చర్చ ఉండదు. మీడియా వాళ్ళు అప్పుడప్పుడు పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతుంటారు కానీ.. అభిమానుల్లో ఈ చర్చ పెద్దగా ఉండదు.

టాలీవుడ్ అనే కాక మొత్తంగా సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ పెళ్ళీడు ఎప్పుడో దాటిపోయినా అటు వైపు అడుగులు వెయ్యలేదు. కొన్నేళ్ల ముందు నుంచే సినిమాలు తగ్గించినా సరే ఆమె పెళ్లి చేసుకోలేదు. అయితే ఎట్టకేలకు అనుష్క పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.

ఎప్పుడు, ఎవరితో అన్న కచ్చితమైన సమాచారం లేదు కానీ అనుష్క శెట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనుష్క కుటుంబానికి సన్నిహితుడైన వ్యాపారవేత్తతో సంబంధం ఖరారైందని, ఇరు కుటుంబాల అంగీకారంతోనే పెళ్లి జరగబోతోందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఐతే అనుష్క టీమ్ నుంచి ఇంకా ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు. పెళ్లి వార్తలను ఖండిస్తూ కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు.

గతంలో కొన్నిసార్లు అనుష్క పెళ్లి గురించి వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. ఈసారి పక్కా అని టాక్ వినిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కు స్వీటీ చాలా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి. అభిమానులు కూడా ఈ జంట కలవాలని కోరుకున్నారు. కానీ తాము మంచి స్నేహితులం మాత్రమే అని ఆ ఇద్దరూ స్పష్టం చేశారు.

దర్శకుడు క్రిష్ తో అనుష్క పెళ్లి అంటూ కూడా ఒక దశలో ప్రచారం జరిగింది. ఐతే తొలి వివాహం విఫలమయ్యాక ఆయన కొన్నేళ్లకు రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ ప్రచారానికి కూడా తెరపడింది. మరి ఇప్పుడు అనుష్క పెళ్లి గురించి వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి. ఆమె చివరగా గత ఏడాది ఘాటి చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. తర్వాత కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చెయ్యలేదు.