ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు సినిమాల అనుభవంతో నాగ్ అశ్విన్ ఆ చిత్రాన్ని ఎవ్వరూ ఊహించనంత గ్రాండ్‌గా, ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు.
పురాణాలను భవిష్యత్తుకు ముడిపెట్టి రూపొందించిన కథ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచింది. కానీ ఆ సినిమా మీద కొన్ని విమర్శలూ తప్పలేదు. ముఖ్యంగా కర్ణుడి పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం పట్ల ఒక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభాస్ చేసిన కర్ణుడి పాత్రను ఎలివేట్ చేయడం కోసం అర్జునుడి పాత్రను తక్కువ చేసి చూపారన్నది వారి అభ్యంతరం.
దుష్టుడైన దుర్యోధనుడి పంచన చేరి పాపాలు చేసిన కర్ణుడిని చాలా సినిమాల్లో చాలా గొప్పవాడిగా చూపించి జనాలకు ఆ పాత్ర మీదే వేరే అభిప్రాయం కలిగేలా చేశారన్నది ఎప్పట్నుంచో ఉన్న వాదన. ‘కల్కి’ రిలీజ్ టైంలో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
టాలీవుడ్లో ప్రముఖ గేయ రచయితల్లో ఒకరైన అనంత శ్రీరామ్.. ‘కల్కి’లో కర్ణుడి పాత్రను ప్రెజెంట్ చేసిన తీరును అప్పట్లో తప్పుబట్టాడు. ఇప్పుడు మరోసారి ఆయన ఆ టాపిక్ మీద మాట్లాడాడు. తన మాటలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని.. కర్ణుడి పాత్రను అలా చూపించడం తప్పు అని.. ఇలా ఎవరు చేసినా తాను ఊరుకోనని ఆయన స్పష్టం చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. “రామాయణ, మహాభారతాలు కేవలం కథలు కావు. అవి మన చరిత్ర. ఆ ఇతిహాసాలను ఉన్నది ఉన్నట్లుగా మనకు అర్థమయ్యేలా రాశారు. వాటిని ఇష్టం వచ్చినట్లు మార్చే హక్కు ఎవరికీ లేదు. కమర్షియల్ హంగుల కోసం ఒక చెడ్డ పాత్రను గొప్పగా ఎలివేట్ చేసి చూపిస్తే అస్సలు సహించలేం. గతంలో ఇలాంటి తప్పులను ప్రశ్నించడానికి సరైన వేదికలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే గొంతెత్తి మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో మన పురాణాలను ఎవరు వక్రీకరించినా నా స్పందన ఇలాగే ఉంటుంది” అని స్పష్టం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates