జూనియర్ నిర్ణయాలపై కొత్త ఒత్తిళ్లు

ఈ మధ్య ఏదైనా పెద్ద హీరో ప్రాజెక్టు ప్రకటిస్తే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళేదాకా అది ఖచ్చితంగా ఉంటుందన్న గ్యారెంటీ ఉండటం లేదు. అనౌన్స్ చేశాక నెలల గ్యాప్ వస్తే చాలు మధ్యలో ఎన్నెన్నో జరిగిపోయి ఏకంగా కాంబినేషన్లు మారిపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఈ పరిణామాలు కొత్త ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కలయికలో ప్యాన్ ఇండియా మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది వారం నుంచి తిరుగుతున్న వార్తే అయినప్పటికీ చివరి నిమిషంలో ఏదైనా ట్విస్టు ఉంటుందేమోనని ఎదురుచూసినా నో చేంజ్.

నిజానికీ బుచ్చిబాబు ఇదే కథను తారక్ తో తీయాలని ఉప్పెన టైం నుంచే ప్లానింగ్ లో ఉన్నాడు. కానీ ఆర్ఆర్ఆర్ ఆలస్యంతో పాటు ఆచార్య వ్యవహారాల నుంచి బయటికి వచ్చి స్క్రిప్ట్ ని లాక్ చేయడానికి కొరటాల శివ చాలా టైం తీసుకోవడంతో జూనియర్ కు ఆప్షన్లు తగ్గిపోయాయి. పైగా వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. అది వాయిదా వేయడానికి లేదు. అతని కోసం పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎట్టి పరిస్థితిల్లో వదలకూడదు. అందుకే డ్రాపవ్వడం ఇష్టం లేకపోయినా బుచ్చిబాబును చరణ్ కు రికమండ్ చేశాడనే టాక్ తిరుగుతోంది. అది కూడా ప్రాణ స్నేహితుడు కాబట్టే.

అంతకు ముందు త్రివిక్రమ్ ది కొంత దూరం ప్రయాణం చేశాక వదిలేయడం అది కాస్తా మహేష్ బాబుకి చేరడం జరిగిపోయాయి. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 28 కథ మారి ఉండొచ్చు కానీ అరవింద సమేత వీర రాఘవ లాంటి స్టయిలిష్ ఫ్యాక్షన్ మూవీని ఇచ్చిన కాంబోని మిస్ అయ్యామని ఫ్యాన్స్ ఫీలయ్యారు. సోలో హీరోగా తారక్ ని తెరమీద చూసి నాలుగేళ్లు దాటింది. కొరటాలది 2023లో దసరా లేదా దీపావళికి ముందు వచ్చే ఛాన్స్ లేదు. అంతకన్నా లేట్ అయితే ఆపై ఏడాది సంక్రాంతి తప్ప ఆప్షన్ ఉండదు. ఇంత విలువైన సమయాన్ని ఖర్చు పెట్టిన తారక్ దానికి తగ్గ మంచి ఫలితమే అందుకోవాలి.