కాంతార నేర్పిస్తున్న పాఠం

కాంతార సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు చాలామందికి తలెత్తుతున్న ప్రశ్న.. ఇలాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు రావు అని. మన దర్శకులు ఎప్పుడూ నాలుగ్గోడల మధ్య కూర్చుని ఒక ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఒకే రకం కథలను వండడం మానేసి.. మన చరిత్రను, సంస్కృతిని, మనం పక్కన పెట్టేసిన జీవన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే.. వాటి గురించి చదివితే మన దగ్గరా ‘కాంతార’ లాంటి కథలు ఆటోమేటిగ్గా తెరపైకి వస్తాయనడంలో సందేహం లేదు.

నిజానికి ‘కాంతార’ లాంటి సినిమాను మన ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే అది మన నేటివిటీతో ముడిపడ్డ సినిమా కాదు. కర్ణాటకలో మారు మూల పల్లెల్లోని వన దేవతలు.. ఆ దేవతల ముందు నాట్యం చేసే భూత కోళ నృత్యకారుల చుట్టూ తిరిగే కథ ఇది. కానీ తమ సంస్కృతిని భాష, ప్రాంతీయ భేదం లేకుండా అందరూ ఆసక్తిగా చూసేలా రిషబ్ శెట్టి అద్భుత రీతిలో వెండితెరపై ప్రెజెంట్ చేశాడు. ఇది మన సంస్కృతి కాదు.. మన నేటివిటీ కాదు అనుకోకుండా.. అందరూ చూపు తిప్పుకోకుండా తెరకు అంకితం అయ్యేలా చేయగలిగాడు.

కల్చర్ ఎవరిదైనా సరే.. దాన్ని కొత్తగా, ఆకర్షణీయంగా ప్రెజెంట్ చేస్తే ఎవ్వరైనా ఆకర్షితులు అవుతారనడానికి ఇది రుజువు. మన పల్లెటూళ్లలోకి వెళ్తే.. అక్కడ మట్టి మనుషులను కలిస్తే.. గ్రామాల్లో జరిగే జాతరలు.. వేడుకలు.. వాటి వెనుక కథలను తెలుసుకుంటే.. ‘కాంతార’ లాంటి కథలను పుట్టించడం కష్టమేమీ కాదు. ప్రాధాన్యం కోల్పోయిన గ్రామీణ కళల గురించి అర్థం చేసుకుని వాటిని అందంగా తెరపైన చూపిస్తే భాషా భేదం లేకుండా అందరూ చూస్తారు. ఆశ్చర్యపోతారు. ఆదరిస్తారు.

కాబట్టి మన రచయితలు.. దర్శకులు సిటీల్లో కూర్చుని.. సీడీలు చూసి కథలు అల్లడం.. కమర్షియల్ లెక్కలేసుకుని స్క్రిప్టులు తీర్చిదిద్దడం వదిలిపెట్టాలి. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశోధన చేస్తే కొత్త కథలు.. పాత్రలు.. సన్నివేశాలు వాటంతట అవే పుట్టుకొస్తాయి. నిజానికి మన ‘రంగస్థలం’ చూసే రిషబ్ స్ఫూర్తి పొందాడని ‘కాంతార’ చూస్తే అర్థమవుతుంది. కానీ దానికి ఎంచుకున్న నేపథ్యం ఈ సినిమాకు ఒక కొత్త కలర్ తీసుకొచ్చింది. దాని స్థాయిని పెంచింది. కాబట్టి మన వాళ్లు కొంచెం మన మూలాల్లోకి వెళ్తే అద్భుతమైన కథలు బయటికి రావడం గ్యారెంటీ.