నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు బోయపాటి చిత్రం ‘జయ జానకి నాయక’లో చిన్న పాత్ర చేసిన ప్రగ్యాకు.. ‘అఖండ’లో మెయిన్ హీరోయిన్‌గా ప్రమోషన్ దక్కింది. ఈ చిత్రానికి సీక్వెల్ చేయడంతో ప్రగ్యా పాత్ర కొనసాగుతుందనే అంతా అనుకున్నారు.
ముందు ఈ సినిమాలో ఆమె ఉన్నట్లే వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కథ మారిపోయింది. ఈ సినిమాలోకి సంయుక్త రూపంలో కొత్త హీరోయిన్ వచ్చింది. అయినా సరే ప్రగ్యా కూడా ఈ మూవీలో ఉంటుందేమో, తన పాత్రను తగ్గిస్తారేమో అనుకున్నారంతా. కానీ చివరికి చూస్తే ప్రగ్యా సినిమాలో కనిపించడం లేదు.
కథ ప్రకారం ప్రగ్యా పాత్రను ఏం చేసి ఉంటారు.. ఆమె ఈ సినిమాలో ఎందుకు లేదు అనే సందేహాలు జనాల్లో ఉన్నాయి. దీనికి బాలయ్య సరదాగా సమాధానం ఇచ్చారు. ప్రగ్యా పాత్ర ఎందుకు సినిమాలో లేదో ఆయన వెల్లడించారు. ‘‘ప్రగ్యా జైస్వాల్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఏం చేస్తుంది అని నేను, బోయపాటి గారు కలిసి ఆలోచించాం. పెద్దగా స్కోప్ కనిపించలేదు. పైగా అనవసరంగా లెంగ్త్ పెరిగిపోతుంది. అందుకే ఆవిడ ఫొటోకి దండ వేసేశాం’’ అని బాలయ్య చమత్కరించారు.
బాలయ్య మాటల్ని బట్టి చూస్తే కథలో ప్రగ్యా పాత్రను చంపేశారన్నమాట. మరి సంయుక్త పాత్రను కథలోకి ఎలా తీసుకొచ్చారు అన్నది ఆసక్తికరం. ‘అఖండ’లో లాగే బాలయ్య ఇందులోనూ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఒకటి నార్మల్ బాలయ్య క్యారెక్టర్ కాగా.. ఇంకోటి అఘోరా పాత్ర. లెజెండ్, అఖండ స్టయిల్లోనే రెండో బాలయ్య పాత్రను ఇంటర్వెల్ ముంగిట రంగంలోకి దించుతారని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates