శాండల్ వుడ్ వెలిగిపోతోంది

ఒకప్పుడు కన్నడ సినిమా మార్కెట్ చాలా పరిమితం. ఎక్కువ రీమేకుల మీద ఆధారపడుతూ బడ్జెట్ మహా అయితే ఇరవై కోట్లకు మించకుండా బిజినెస్ రేంజ్ కూడా అంతకంటే దాటి వెళ్ళేది కాదు. కర్ణాటక బోర్డర్ లో ఉండే తెలుగు ప్రాంతాల్లోనూ ఆ బాష వచ్చినా సరే శాండల్ వుడ్ చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడే వారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మలయాళంను మించిన కన్నడిగుల క్రియేటివిటీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. గతంలో డబ్బింగ్ హక్కులు కొనేందుకు కూడా భయపడిన ఇతర బాషల నిర్మాతలు ఇప్పుడక్కడ నిర్మాణంలో ఉన్నవాటి మీద సీరియస్ గా దృష్టి పెడుతున్నారు.

ఇది కెజిఎఫ్ తో మొదలయ్యిందన్నది వాస్తవం. పెద్దగా అంచనాలు లేకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని అతి తక్కువ ధరకు అమ్మినప్పుడు అది నాలుగింతలు ఎక్కువ లాభాలిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక సెకండ్ పార్ట్ ప్రభంజనం అందరికీ తెలిసిందే. కుక్కని టైటిల్ రోల్ లో పెట్టి చేసిన 777 ఛార్లీ దేశవ్యాప్తంగా గొప్ప విజయం అందుకుంది. ఎంతగా అంటే ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ చేస్తే పే పర్ వ్యూ పెట్టేందుకు ధైర్యం చేసేంత. కంటెంట్ విషయంలో కంప్లయింట్లున్నా విక్రాంత్ రోనాకు వచ్చిన ఓపెనింగ్స్, వసూళ్లు మారిన జనాల దృక్పథాన్ని సూచించేవే .

ఇప్పుడు కాంతారా వంతు వచ్చింది. మార్నింగ్, మ్యాటీలకు పెద్దగా జనం లేరు. కట్ చేస్తే సాయంత్రంతో మొదలు సెకండ్ షోలు, సండే షోలు అన్నీ అడ్వాన్స్ గానే ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అలా అని ఇదేం కమర్షియల్ బొమ్మ కాదు. అసలు మన నేటివిటీకి ఏ మాత్రం సంబంధం లేని ఒక డివోషనల్ విలేజ్ డ్రామా. కాస్త క్రైమ్, థ్రిల్ ని మిక్స్ చేసి హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి చేసిన మేజిక్ కి పబ్లిక్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియా రివ్యూలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ పరిణామాలు గమనిస్తుంటే పక్క రాష్ట్రాల్లో ఒకప్పుడు కోలీవుడ్ ఎంజాయ్ చేసిన పీక్ మార్కెట్ ని ఇప్పుడు శాండల్ వుడ్ టేకోవర్ చేసేలా ఉంది.