సాహో దర్శకుడికి మిస్సయిన మెగా హిట్

ఇప్పుడు ఇండస్ట్రీలో, ట్రేడ్ వర్గాల్లో ఎక్కడ చూసినా గాడ్ ఫాదర్ గురించిన చర్చే జరుగుతోంది. రిలీజ్ కు ముందు వరకు పెద్దగా ప్రమోషన్లు హడావిడి లేకుండా సోషల్ మీడియా ఫ్యాన్స్ ఆగ్రహానికి సైతం గురైన ఈ మెగా మూవీ సాధించిన సక్సెస్ చూసి ఎవరికీ నోట మాట రావడం లేదు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిందని చెప్పడం తొందరపాటు అవుతుంది కానీ అయిదు రోజులకు సాధించిన వసూళ్లు చూస్తుంటే మాత్రం బాస్ ఈజ్ బ్యాక్ అనే క్యాప్షన్ మరోసారి ఋజువయ్యింది. ఒక్కోసారి అంచనాలు లేకపోవడం, ప్రీ నెగటివ్ పబ్లిసిటీ కూడా మేలే చేస్తుందనడానికి ఇదే మంచి ఉదాహరణ.

సరే ఇది కాసేపు పక్కనపెడితే లూసిఫర్ రీమేక్ కన్ఫర్మ్ అయినప్పుడు ముందు ఇది సాహో దర్శకుడు సుజిత్ చేతికి వెళ్లిన విషయం అలా గుర్తు చేసుకుంటే సగటు మూవీ లవర్స్ ఎవరికైనా ఫ్లాష్ అవుతుంది. స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ ని సంతృప్తి పరచలేకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది కానీ ఒకవేళ చిరంజీవి లేదా చరణ్ కన్విన్స్ అయ్యి ఉంటే ఈ రోజు సుజిత్ గురించే మాట్లాడుకోవాల్సి వచ్చేది. అలా అని అది నేరుగా మోహన్ రాజా చేతికేం రాలేదు. మధ్యలో వివి వినాయక్ తో చర్చలు జరిగాయి. రచయిత ఆకుల శివతో ఒక వెర్షన్ ట్రై చేశారు. సుకుమార్ తో రచన చేయించే ప్రయత్నం అయ్యింది.

ఇవన్నీ తెరవెనుక వ్యవహారాలే. ఏదీ అఫీషియల్ గా బయటికి రాలేదు. అవన్నీ వర్కౌట్ కాకపోవడంతో చెన్నైలో ఉన్న మోహన్ రాజాకు కాల్ వెళ్లడం, అతను రంగంలోకి దిగాక చకచకా చేతులు మనుషులు మారిపోవడం జరిగిపోయాయి. కట్ చేస్తే ఫ్యాన్స్ ఎదురు చూసిన బ్లాక్ బస్టర్ వచ్చేసింది. ఆచార్య దెబ్బకు ఇకపై చిరంజీవి సినిమాలు ఓపెనింగ్స్ తెచ్చుకుంటాయా లేదానే అనుమానాలు బద్దలు కొడుతూ పబ్లిక్ థియేటర్లకు వెళ్లడం కళ్ళముందు కనిపిస్తోంది. సరైన కంటెంట్ ఉన్న బొమ్మ పడితే మెగాస్టార్ ఏ స్థాయిలో రచ్చ చేస్తారో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఏదైతేనేం మొత్తానికి సుజిత్ కు మిస్ అయ్యింది గోల్డెన్ ఛాన్సే.