ఇండియన్-2 ఈజ్ బ్యాక్.. వాటే టైమింగ్

కొన్నిసార్లు ఏం జరిగినా మన మంచికే అనుకోవాల్సి ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘కార్తికేయ-2’ అందుకు ఒక ఉదాహరణ. ఆ చిత్రం వాయిదా పడడం చివరికి మంచిదే అయింది. సరైన టైమింగ్‌లో రిలీజై బ్లాక్‌బస్టర్ అయిందా చిత్రం. దీని కంటే ముందు రావాల్సిన ‘18 పేజెస్’ వాయిదా పడడం కూడా మంచిదైంది. కార్తికేయ-2 సక్సెస్ తర్వాత అది రావడం బిజినెస్ పరంగా బాగా ప్లస్ అవుతుంది. ఇక కమల్ హాసన్ సినిమా ‘ఇండియన్-2’ విషయంలోనూ ఆలస్యం మేలే చేసింది.

ఈ సినిమా రెండేళ్ల కిందటే పూర్తి కావాల్సింది. 2020లో విడుదలవ్వాల్సింది. కానీ ఆ ఏడాది ఆరంభంలో షూటింగ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదం వల్ల సినిమా నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. అది అనుకున్న ప్రకారం పూర్తయి ఉంటే కొవిడ్ టైంలో ఎలా రిలీజై ఎలాంటి ఫలితం అందుకునేదో అంచనా వేయలేం. రెండేళ్ల పాటు ఆగిన షూటింగ్ ఎట్టకేలకు మరికొన్ని రోజుల్లో పున:ప్రారంభం కాబోతోంది.

మంగళవారం అర్ధరాత్రి ఒక అదిరిపోయే ఇండియన్-2 పోస్టర్ ద్వారా కమల్ హాసన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో వైట్ డ్రెస్‌లో కమల్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇంతకుముందు వరకు లైకా ప్రొడక్షన్స్ మాత్రమే ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇప్పుడు హీరో కమ్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ కూడా దీనికి తోడైంది. ఇకపై పెట్టుబడి మొత్తం ఈ సంస్థే పెట్టేలా ఉంది. ‘విక్రమ్’ లాంటి ఇండస్ట్రీ తర్వాత కమల్ నుంచి రాబోయే సినిమా కావడంతో ‘ఇండియన్-2’కు ఒక్కసారిగా హైప్ పెరిగిపోతుందనడంలో సందేహం లేదు.

‘విక్రమ్’ కంటే ముందు, కరోనా టైంలో వచ్చి ఉంటే కచ్చితంగా సినిమా మీద ప్రతికూల ప్రభావం పడేది. వాయిదా వల్ల వడ్డీల భారం పడి ఉండొచ్చు కానీ.. ఆ మేరకు ఇప్పుడు వచ్చే హైప్ నష్టాన్ని భర్తీ చేయడమే కాక అదనపు ఆదాయాన్ని కూడా తెచ్చి పెట్టవచ్చు. రామ్ చరణ్ చిత్రాన్ని పక్కన పెట్టి మరీ శంకర్ ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ‘ఇండియన్-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.