రామ్ గోపాల్ వర్మని ఇలాగే వదిలేస్తారా?

సినిమాల గురించి, సినిమా వ్యక్తుల గురించి పుకార్లు ప్రపంచవ్యాప్తంగా మాములే అయినా కానీ, తమపై నెగెటివ్ న్యూస్ అన్నది రావడానికి వీలు లేదని హుంకరించిన తెలుగు చిత్ర పరిశ్రమ మరి రామ్ గోపాల్ వర్మ ఆగడాలను ఎందుకు సహిస్తున్నట్టు?

తన ఇష్టానికి వ్యక్తులను, వ్యక్తిగత జీవితాలను క్యాష్ చేసుకోవడానికి కించిత్ సిగ్గు పడని వర్మకి ఇంత వరకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నిరసన ఎందుకు రానట్టు? పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తానంటూ ప్రకటించి మరోసారి అటెన్షన్ కోసం ఏమైనా చేసేస్తానని వర్మ చాటుకున్నాడు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తోందే తప్ప ఖండించలేదు. పూనమ్ కౌర్ కి ఉన్న పాటి ఖలేజా మన సో కాల్డ్ హీరోలకు లేదు.

వర్మను ఏమైనా అంటే తమ మీదకు వస్తాడనే భయమా? అతడిని తెలుగు సినిమా పరిశ్రమ ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు? వాళ్ళ మీదా వీళ్ళ మీదా ప్రతాపం చూపించే టాలీవుడ్ కి వర్మ మీద యాక్షన్ తీసుకోడానికి దమ్ము చాలడం లేదా? అలాంటప్పుడు ఎవరేమి అన్నా, ఎక్కడేమి రాసుకున్నా తుడిచేసుకోవాలి. అంతే తప్ప ఒకరి మీద ప్రతాపం చూపించి ఇంకో చోట దుప్పటి ముసుగేసుకోకూడదు.