స్టార్లు ఎప్పటికైనా స్టార్లే

కోట్లాది అభిమానులున్న పెద్ద స్టార్ హీరోలను పరాజయాలు, మార్కెట్ పరిస్థితులు ప్రభావితం చేస్తాయా. వాళ్ళ ఇమేజ్ ని తగ్గిస్తాయా. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ విశ్లేషణలో చూద్దాం.1995లో చిరంజీవి వరస ఫ్లాపులతో సతమవుతున్నప్పుడు ఒక సంవత్సరం పాటు అసలే సినిమా చేయకుండా మౌనంగా ఉండిపోయారు. మెగాస్టార్ వైభవం తగ్గిపోయిందనే కామెంట్స్ వచ్చాయి. కట్ చేస్తే 1997లో హిట్లర్ తో ఇచ్చిన కం బ్యాక్ దెబ్బకు బాక్సాఫీస్ కు మళ్ళీ ఊపొచ్చింది. కొంత గ్యాప్ అయ్యాక డాడీ, మృగరాజు ఫ్లాప్ అయిన టైంలోనూ వ్యంగ్యాస్త్రాలు వినిపించాయి. కొత్త మాస్ హీరోల దెబ్బకు రిటైర్ అయిపోతే మంచిదని కథనాలు రాసిన పత్రికలున్నాయి.

తర్వాత అదే మీడియా ఇంద్ర ప్రభంజనం గురించి స్టోరీలు రాసి తమ పత్రికల అమ్మకాలు పెంచుకున్నాయి. ప్రజారాజ్యం పార్టీ స్థాపన వల్ల రాజకీయాల కోసం ఎనిమిదేళ్లు తెరకు దూరంగా ఉన్నా ఖైదీ నెంబర్ 150 సక్సెస్ రూపంలో ఆయన సింహాసనానికి లోటేమీ లేదని ప్రేక్షకులు దాన్ని సూపర్ హిట్ చేయడం ద్వారా నిరూపించారు. ఆగకుండా డిజాస్టర్లు ఇస్తున్న టైంలో నందమూరి బాలకృష్ణ బోయపాటి శీనుతో చేతులు కలిపినప్పుడు ఆ కుర్ర డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడనే వెటకారం ఇండస్ట్రీలోనే కనిపించింది. తీరా చూస్తే సింహా ఊచకోతకు రికార్డులు అల్లాడిపోయాయి. మధ్యలో లెజెండ్ నుంచి అఖండ దాకా ఆ ఇద్దరి జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.

2000 సంవత్సరానికి ముందు మితాబ్ బచ్చన్ స్టార్ డం తగ్గిపోయి స్వంత కంపనీ ఏబిసి దివాళా తీసినప్ప్పుడు బిగ్ బి కోలుకోవడం కష్టమన్నారు. ఆస్తులన్నీ అమ్మేసి వెళ్ళిపోతారనే ప్రచారం జరిగింది.ఆ సమయంలో స్టార్ ఛానల్ లో చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి క్విజ్ ప్రోగ్రాం ఆయన దశను మార్చి కొత్త కెరీర్ ఇచ్చింది. ఇప్పటికీ ఎనిమిది పదుల వయసులోనూ మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. శివ తర్వాత డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకున్న నాగార్జున సైతం టఫ్ ఫేజ్ ని చూశారు. అల్లూరి సీతారామరాజు తర్వాత సూపర్ స్టార్ కృష్ణను 14 ఫ్లాపులు పలకరించాయి. అయినా ఆయన భయపడలేదు. పాడిపంటలుతో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చారు.

మరో గొప్ప ఉదాహరణ చూస్తే 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలో వచ్చాక స్వర్గీయ ఎన్టీఆర్ వెండితెరకు స్వస్తి చెప్పారు. తిరిగి కొనసాగాలని నిర్ణయించుకున్నప్పుడు జరిగిన పరిణామాలు వేరు. సామ్రాట్ అశోక, బ్రహ్మర్షి విశ్వామిత్ర, శ్రీనాధ కవిసార్వభౌమలు ఘోరంగా డిజాస్టర్లయ్యాయి. ఇక మేకప్ వేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అయితే బసవతారకం ట్రస్ట్ నిధుల కోసం 1994లో మేజర్ చంద్రకాంత్ చేస్తే ఆయన అందుకున్న ఘనస్వాగతం గురించి మోహన్ బాబు ఎప్పుడు అడిగినా కథలుగా చెబుతారు. అంత వయసులోనూ అన్నగారి నటన చూసి సామాన్య ప్రేక్షకులు పులకరించిపోయారు. ఆ ఏడాది టాప్ 5 హిట్స్ దాని చోటు నెంబర్ వన్.

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం విక్రమ్ హిట్ లిస్ట్. దశావతారం తర్వాత కమల్ హాసన్ కు కనీస హిట్ లేకుండా పోయింది. ఉత్తమ విలన్, విశ్వరూపం 2 లాంటి డిజాస్టర్లు కనీసం థియేటర్ రెంట్లు కూడా తేలేకపోయాయి. ఇప్పుడు విక్రమ్ కలెక్షన్లు చూసి ఎవరికీ నోట మాట రావడం లేదు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రతిభ ఉన్నప్పటికీ స్క్రీన్ మీద కమల్ విశ్వరూపం చూసి సాధారణ ప్రేక్షకులు కూడా మైమరిచిపోతున్నారు. తెలుగు హక్కులను నితిన్ కుటుంబం 6 కోట్లకు డీల్ చేసినప్పుడు అంత మొత్తం వస్తుందానే అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు లాభాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అందుకే స్టార్లు ఎప్పటికైనా స్టార్లే అని చెప్పడానికి ఇంతకన్నా రియల్ స్టోరీలు ఏముంటాయి