‘శేఖర్’ అప్పులు తీరుస్తుందా ?

“ప్రస్తుతం అప్పులపాలయ్యాను.. ‘శేఖర్’ ఆడితే ఆ అప్పులు తీర్చుకొని మరో సినిమా నిర్మించగలను” తాజాగా రాజశేఖర్ మీడియాతో చెప్పుకున్న మేటర్ ఇది. గత కొంత కాలంగా సొంత నిర్మాణంలోనే సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు రాజశేఖర్. తాజాగా ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘శేఖర్’ రేపే థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సందర్భంగా రాజశేఖర్ , జీవిత ఇద్దరూ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమాను కొంత వరకూ వేరే డైరెక్టర్ హ్యాండిల్ చేశాడు. చిన్న ఇష్యూతో అతను పక్కకి తప్పుకున్నాడు. దాంతో మిగిలిన భాగం జీవితానే డైరెక్ట్ చేసి పేరు వేసుకుంది.

మలయాళంలో వచ్చిన జోసెఫ్ అనే సినిమాకు రీమేక్ ఇది. అక్కడ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఏరి కోరి మరీ ఈ రీమేక్ తీసుకోచ్చుకున్నారు జీవిత రాజశేఖర్. అయితే సినిమా క్లైమాక్స్ కాస్త ఎమోషనల్ గా ఉంటుంది. దాన్ని తెలుగులో కూడా అలాగే ఉంచేశారు. ఎలాంటి మార్పులు లేకుండా మక్కీ కి మక్కీ తీశారు. ఇక ట్రైలర్ కి కొంత బజ్ వచ్చినప్పటికీ ప్రస్తుతం బుకింగ్స్ మాత్రం వీక్ గానే ఉన్నాయి. రేపు చెప్పుకో దగిన సినిమాలేవీ లేవు. ఏ మాత్రం టాక్ బాగున్నా సినిమా హిట్టయ్యే చాన్స్ ఉంది. హిట్ టాక్ వస్తే బుకింగ్స్ ఫాస్ట్ అవ్వొచ్చు.

ఇక ఈ సినిమా తర్వాత చాలా ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయని అందులో తమ ఫ్యామిలీ మొత్తం కలిసి నటించే కథ కూడా ఉందని చెప్పాడు రాజశేఖర్. అలాగే సీనియర్ డైరెక్టర్ విజయ భాస్కర్ తన చిన్న కూతురు శివాత్మికతో ఓ సినిమా చేయబోతున్నరంటూ చెప్పాడు. కానీ ఇవన్నీ శేఖర్ రిజల్ట్ ని బట్టే ముందుకు కదులుతాయని అప్పటి వరకూ ఏమి చెప్పలేనని అన్నాడు.ఈ సినిమా ఆడకపోతే ఇక అంతే సంగతులు అన్నట్టుగా చెప్పుకున్నారు రాజశేఖర్. ఏదేమైనా శేఖర్ విజయం జీవిత రాజశేఖర్ కి చాలా కీలకమే.