అప్పుడప్పుడూ కొన్ని కాంబినేషన్లు భలే ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. ఆ కాంబినేషన్లలో ఎవ్వరూ సినిమాలు ఊహించరు. కొందరి కలయిక చూస్తేనే సినిమా పట్ల అమితాసక్తి కలుగుతుంది. గత ఏడాది ‘విక్రమ్’ సినిమా కోసం కమల్ హాసన్-విజయ్ సేతుపతి-ఫాహద్ ఫాజిల్-లోకేష్ కనకరాజ్ కలిసినపుడు ఇలాంటి ఆసక్తే కలిగింది. ఇప్పుడు తమిళంలో ఇలాగే ఒక సెన్సేషనల్ కాంబినేషన్లో సినిమాను ప్రకటించారు.
‘మహానటి’తో జాతీయ పురస్కారం అందుకున్న కీర్తి సురేష్.. ఇండియాలో ఈ తరం ఉత్తమ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్.. లెజెండరీ కమెడియన్ వడివేలు.. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడైన ఉదయనిధి స్టాలిన్.. ఈ నలుగురి కలయికలో ఒక వైవిధ్యమైన సినిమా రాబోతోంది. ఆ చిత్రం పేరు.. మామన్నన్. ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నది వడివేలు కావడం.. ప్రి లుక్ పోస్టర్లో కాస్టింగ్లో ఆయన పేరే పైన వేయడం విశేషం.
జాతీయ అవార్డు సాధించిన ‘పరియేరుం పెరుమాల్’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రంలోనే సంచలనం సృష్టించి.. ఆ తర్వాత ధనుష్ హీరోగా ‘కర్ణన్’ అనే మరో క్లాసిక్ తీసిన మారి సెల్వరాజ్ ‘మామన్నన్’కు దర్శకుడు కావడం విశేషం. గురువు పా.రంజిత్ బాటలో వైవిధ్యమైన సినిమాలతో చాలా త్వరగా గొప్ప పేరు సంపాదించాడు మారి సెల్వరాజ్. ‘కర్ణన్’ విడుదలై ఏడాది కావస్తుండగా.. ఇంకా అతను తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించలేదు. ఐతే ఆలస్యం అయినప్పటికీ.. క్రేజీ కాంబినేషన్లో సినిమాను అనౌన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తుండటం విశేషం. ఉదయనిధి స్టాలిన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అతడి కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఫిలిం అనడంలో సందేహం లేదు. ఐతే వడివేలు, కీర్తి, ఫాహద్ లాంటి పెర్ఫామర్ల మధ్య నటుడిగా ఏమంత మంచి పేరు లేని ఉదయనిధి ఏమాత్రం సత్తా చాటుకుంటాడన్నదే సందేహం. సీఎం కొడుకు కావడం వల్లే అతడికీ చిత్రంలో అవకాశం దక్కిందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.