‘తలైవి’ దర్శకుడితో అనుష్క సినిమా?

మొన్నమొన్నటి వరకు టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా.. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకి కేరాఫ్‌గా వెలిగిన అనుష్క.. ఇప్పుడు ఎప్పుడో కానీ ప్రేక్షకుల ముందుకు రానంత డల్ అయిపోయింది. బాహుబలి 2 తర్వాతి సంవత్సరం ‘భాగమతి’గా వచ్చింది. తర్వాతి యేడు ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ చిన్న పాత్రలో మెరిసింది.

ఆ నెక్స్ట్ ఇయర్‌‌ ‘నిశ్శబ్దం’ మూవీ చేసింది. పోయినేడు ఒక్క సినిమా కూడా చేయలేదు. దాంతో ఆమె అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు. అయితే ఇప్పుడు స్వీటీ రూట్ మార్చుతున్నట్టు తెలుస్తోంది. వరుస సినిమాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.

ఆల్రెడీ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌లో ఓ సినిమాకి కమిటయ్యింది. పోయినేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. నవీన్ పొలిశెట్టి మేల్‌ లీడ్‌గా నటిస్తున్న ఈ మూవీ ఎంతవరకు వచ్చిందనేది తెలీదు కానీ రీసెంట్‌గా అనుష్క మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్త బైటికొచ్చింది.       

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి ఓకే చెప్పిందట అనుష్క. ఇది ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రమట. స్క్రిప్ట్‌ రెడీ అయ్యిందట. త్వరలోనే అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు. సక్సెస్ రేట్ పక్కన పెడితే విజయ్ విషయం ఉన్న దర్శకుడు. బలమైన కథల్ని ఓ డిఫరెంట్ ట్రీట్‌మెంట్‌తో తీసుకొస్తుంటాడు. రీసెంట్‌గా జయలలిత బయోపిక్ ‘తలైవి’ తీశాడు. మరి అనుష్క కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడో.