మోహన్ బాబు.. ఒక భారీ కుటుంబ కథా చిత్రం

Mohanbabu

తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. చిన్న చిన్న విలన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్‌తో మొదలుపెట్టి.. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్‌, ఎస్వీఆర్ లాంటి మేటి నటులకు దీటుగా నిలిచారాయన. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్ర అయినా మోహన్ బాబు చేస్తే దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. తెలుగు సినిమా చరిత్రలో ఆయనది ఒక ప్రత్యేక అధ్యాయం.

ఐతే ఇంత మంచి నటుడిని ఈ తరం దర్శకులు ఉపయోగించుకోకపోవడం విచారించాల్సిన విషయమే. మోహన్ బాబును ఎవరూ అడగట్లేదా.. ఆయనే సినిమాలు చేయట్లేదా అన్నది తెలియదు కానీ.. తెలుగు పరిశ్రమ ఒక మంచి నటుడిని దూరం చేసుకుంటున్న మాట మాత్రం వాస్తవం. గత దశాబ్ద కాలంలో మోహన్ బాబు చాలా తక్కువ సినిమాలే చేశారు. అవి కూడా సొంత సంస్థలో, అంతగా విషయం లేనివే.

చివరగా ‘గాయత్రి’ లాంటి పేలవమైన సినిమా చేసిన మోహన్ బాబు.. ఈ మధ్య తమిళంలో సూర్య సినిమా ‘సూరారై పొట్రు’ (ఆకాశమే నీ హద్దురా) చేశారు. మణిరత్నం మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో కూడా నటిస్తున్నట్లు చెబుుతున్నారు. మరి తెలుగు సినిమాల మాటేంటి అని ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబును అడిగితే.. గత కొన్నేళ్లలో తనను కొందరు తెలుగు దర్శకులు కొన్ని పాత్రల కోసం అడిగారని.. కానీ తాను చేయలేదని చెప్పారు.

తాను కావాలనే గ్యాప్ తీసుకున్నానని, మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెడితే 365 రోజులూ పని చేస్తానని ఆయనన్నారు. ప్రస్తుతం ‘పెదరాయుడు’ తరహాలో ఒక భారీ కుటుంబ కథా చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలనుకుంటున్నామని.. అందుకోసం కథ కూడా తయారైందని.. ఆ చిత్రంలో చాలా మంది నటీనటులుంటారని.. ఆ సినిమా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు మోహన్ బాబు. మరి మంచు వారి బేనర్లో రాబోయే ఆ భారీ చిత్రం ఏదో చూడాలి.