లారెన్స్ సినిమాకు ఇద్దరు దర్శకులు

అసిస్టెంట్ డ్యాన్సర్లలో ఒకడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ అయిన.. ఆపై నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రతిభను చాటుకున్నాడు రాఘవ లారెన్స్. డ్యాన్స్ మాస్టర్ నటుడవడం వరకు ఓకే కానీ.. దర్శకుడిగా సత్తా చాటుకోవడం మాత్రం అనూహ్యమే. అతడి దర్శకత్వంలో మాస్, కాంఛన, గంగ లాంటి బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఇప్పుడతను దర్శకత్వానికి కొంచెం బ్రేక్ ఇచ్చి.. నటుడిగా బిజీ అవుతున్నాడు.

తమిళంలో ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో ఒకటి.. దుర్గ. గత ఏడాది ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన లారెన్స్ లుక్స్ చూసి జనాలు షాకైపోయారు. అందులోనూ ముసలి అవతారంలో ఉన్న లారెన్స్ వావ్ అనిపించాడు. ఐతే ఈ సినిమా గురించి ఇంకే అప్‌డేట్స్ లేవు. ఇది ‘కాంఛన’ సిరీస్‌లో కొత్త సినిమానా.. దీనికి లారెన్సే దర్శకుడా అనే విషయంలో క్లారిటీ లేకపోయింది.

ఐతే ‘దుర్గ’ గురించి లారెన్స్ ఇప్పుడు ఆశ్చర్యకర అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకు అతను దర్శకత్వం వహించట్లేదు. దాన్ని ఇద్దరు దర్శకుల చేతిలో పెట్టడం విశేషం. వాళ్లే.. అన్బు, అరివు. వీళ్లిద్దరికీ దర్శకత్వం కొత్త కానీ.. ఇండస్ట్రీలో వీళ్లు చాలా పాపులర్. ఈ కవల సోదరులు తమిళంలో ఫేమస్ ఫైట్ మాస్టర్స్. ‘కబాలి’ సినిమాతో యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా ప్రస్థానం మొదలుపెట్టి తమిళంలోనే కాక ఇండియాలోనే టాప్ ఫైట్ మాస్టర్స్‌గా పేరు సంపాదించారు.

కేజీఎఫ్ సినిమాతో వాళ్ల పేరు మార్మోగిపోయింది. ఈ చిత్రానికి వారికి ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా జాతీయ అవార్డు కూడా రావడం విశేషం. దీంతో పాటు ఇరుముగన్, ఖైదీ, తడమ్, సార్పట్ట లాంటి సినిమాలు వారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ‘బీస్ట్’ లాంటి భారీ చిత్రానికి ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. ఇంతలోనే వీరికి దర్శకత్వం చేసే అవకాశం కల్పించాడు లారెన్స్. ఒక డ్యాన్స్ మాస్టర్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఇలా ఇద్దరు ఫైట్ మాస్టర్లు దర్శకత్వం వహించడం విశేషమే.