మెగా ట్రైల‌ర్ల జాత‌ర‌

క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత నెమ్మ‌దిగా పెద్ద సినిమాల సంద‌డి పెరుగుతోంది. హిందీలో ఈ నెల సూర్య‌వంశీ, స‌త్య‌మేవ జ‌య‌తే, అంతిమ్ లాంటి సినిమాలు రిలీజ‌య్యాయి. త‌మిళంలో తాజాగా మానాడు లాంటి పెద్ద సినిమా విడుద‌లైంది. ఇక డిసెంబ‌రు, జ‌న‌వ‌రి నెల‌ల్లో తెలుగు స‌హా వివిధ భాష‌ల్లో భారీ చిత్రాలు వ‌రుస క‌డుతున్నాయి. 

డిసెంబ‌రు 2న అఖండ‌తో టాలీవుడ్లో మాస్ సినిమాల జాత‌ర మొద‌ల‌వుతోంది. ఇదే రోజు మ‌ల‌యాళంలో మ‌ర‌క్కార్ లాంటి భారీ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా వ‌చ్చే నాలుగైదు రోజుల్లో నాలుగు భారీ చిత్రాల ట్రైల‌ర్లు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఆ చిత్రాల‌న్నింటిపైనా భారీ అంచ‌నాలుండ‌టంతో సోష‌ల్ మీడియా ఈ ట్రైల‌ర్ల టాక్స్‌తో నిండిపోబోతోంది.

ముందుగా ఈ సోమ‌వారం రెండు పెద్ద సినిమాల ట్రైల‌ర్లు లాంచ్ అవుతున్నాయి. అందులో ఒక‌టి మ‌రక్కార్ మూవీది కాగా.. ఇంకోటి 83 సినిమాది. మ‌ర‌క్కార్ ఇప్ప‌టికే 2021 సంవ‌త్స‌రానికి జాతీయ ఉత్త‌మ చిత్రంగా నిలిచింది. మ‌ల‌యాళంలో తొలిసారి వంద కోట్ల భారీ బ‌డ్జెట్లో తెర‌కెక్కిన జాన‌ప‌ద చిత్ర‌మిది. మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ప్రియ‌ద‌ర్శ‌న్ రూపొందించిన ఈ సినిమా ఇప్ప‌టికే కొన్ని ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎగ్జైట్ చేసింది. ఏడాదికి పైగా విడుద‌ల కోసం చూస్తున్న సినిమా ఎట్ట‌కేల‌కు భారీ ఎత్తున రిలీజ‌వుతుండ‌టం, దాని ట్రైల‌ర్ లాంచ్ అవుతుండ‌టంతో సౌత్ ప్రేక్ష‌కులంతా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.

ఇక 1983 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం నేప‌థ్యంలో తెర‌కెక్కిన 83 సినిమా ట్రైల‌ర్ వ‌స్తుండ‌టంతో సినీ, క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ట్రైల‌ర్ కూడా సోమ‌వార‌మే రిలీజ‌వుతుంది. ఇక డిసెంబ‌రు 3న ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ టీం ట్రైల‌ర్ లాంచ్ చేస్తోంది. దీనిపై అంచ‌నాల గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక తెలుగు నుంచి రానున్న మ‌రో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ట్రైల‌ర్‌ను డిసెంబ‌రు 6న లాంచ్ చేయ‌బోతున్నారు. మొత్తానికి వ‌చ్చే వారం రోజుల్లో భారీ సినిమాల ట్రైల‌ర్ల‌తో సోష‌ల్ మీడియా షేక్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.