పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎప్పట్నుంచో ఆశ ఉంది. అతడికి తెలుగు రాష్ట్రాల అవతల మంచి ఫాలోయింగే ఉంది. డబ్బింగ్ సినిమాలతో ఓపక్క కేరళలో.. మరోపక్క నార్త్ ఇండియాలో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. కన్నడ నాట ఎప్పడూ తెలుగు స్టార్లకు మంచి ఆదరణే ఉంటుంది.
దక్షిణాదిన బన్నీకి కొంచెం ఆదరణ తక్కువున్న రాష్ట్రం అంటే తమిళనాడునే. అక్కడ మార్కెట్ పెంచుకునే దిశగా బన్నీ ఇప్పుడు కీలక ముందడుగు వేస్తున్నాడు. అతడి కొత్త చిత్రం పుష్ప తమిళంలో కూడా పెద్ద ఎత్తునే రిలీజ్ కాబోతోంది. పుష్ప తమిళ హక్కులు అక్కడి అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చేతికి వెళ్లడం విశేషం.
కత్తి, 2.0, ఇండియన్-2 లాంటి భారీ చిత్రాలతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో ఒకటిగా కొనసాగుతోంది లైకా. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేస్తోంది కూడా లైకా వాళ్లే. అలాంటి పెద్ద నిర్మాణ సంస్థ పుష్ప మూవీని రిలీజ్ చేస్తోందంటే దీని రీచ్ వేరే లెవెల్లో ఉంటుందనడంలో సందేహం లేదు.
ఫాహద్ ఫాజిల్, రష్మిక మందన్నా లాంటి నటులు తమిళ ప్రేక్షకులకు బాగానే పరిచయం. పుష్ప మూవీ మీద అక్కడ కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అక్కడ ఇప్పటికే పుష్పను అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. పీఆర్వోలు సోషల్ మీడియా ద్వారా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా అని బన్నీ నమ్ముతుండటం, లైకా వాళ్లు తోడవడంతో పుష్పతో బన్నీకి తమిళనాట మంచి మార్కెట్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.