జననాగయన్… విజయ్ కీలక నిర్ణయం?

అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. తమిళ టాప్ స్టార్ విజయ్ చివరి చిత్రం ‘జననాగయన్’ విడుదలై ఆరు వారాలు దాటిపోయి ఉండాలి. కానీ జనవరి 9న సంక్రాంతి కానుకగా రావాల్సిన సినిమా.. సెన్సార్ సమస్యల వల్ల అనూహ్యంగా వాయిదా పడిపోయింది.

వాయిదా అంటే రెండు మూడు రోజులే అని ముందు అనుకున్నారు. కానీ వారాలు గడిచినా ఆ సినిమా విడుదల కాలేదు. ఇంకో రెండు నెలల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం విశ్వ ప్రయత్నం చేసింది. కానీ కుదరలేదు.

ఈ నెలలో రిలీజ్ లేదంటే.. ఇక ఎన్నికలయ్యే వరకు సినిమా రాదని ఫిక్సయిపోవాల్సిందే. త్వరలో తమిళనాట ఎన్నికల కోడ్ రాబోతోంది. ఆ టైంలో ఇలాంటి పొలిటికల్ టచ్ ఉన్న సినిమాను రిలీజ్ చేయడం మరింత కష్టమవుతుంది. కాబట్టి అందరూ ఎన్నికల తర్వాతే ఈ సినిమా వస్తుందని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఏప్రిల్ మధ్యలో ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి వెంటనే ఆ నెల చివర్లో సినిమా రిలీజవుతుందేమో అనుకున్నారు ఫ్యాన్స్.

కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్నికలు అయిన వెంటనే కూడా సినిమా విడుదల కాబోదట. ఫలితాలు కూడా వచ్చాక, జూన్‌లో మంచి ముహూర్తానికి సినిమా విడుదల కానున్నట్లు తాజా సమాచారం. జూన్ 22న విజయ్ పుట్టిన రోజుకే ‘జననాయగన్’ను రిలీజ్ చేయడానికి టీం ఒక నిర్ణయానికి వచ్చిందట.

ఎన్నికల కోసం ఈ సినిమాను ఉపయోగించుకోవాలన్న విజయ్ కోరిక ఫలించలేదు. కాబట్టి ఎన్నికలు అయ్యాక ఎప్పుడు రిలీజైనా ఇబ్బంది లేదు. ఐతే ఫలితాలు వచ్చాయంటే అప్పుడు విజయ్ పవర్ ఫుల్ పొజిషన్లో ఉంటాడనే ఒక అంచనా ఉంది.

ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు ‘జననాయగన్’కు సెన్సార్ లేదా ఇంకే విధంగానూ అడ్డంకులు ఉండకపోవచ్చు. అంతకంటే ముందు రిలీజ్ చేస్తే మాత్రం చాలా సీన్లు, డైలాగులకు కత్తెర వేయాల్సి రావచ్చు. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా.. ఎన్నికల ఫలితాలు వచ్చాక, ఫ్యాన్స్ బాగా సెలబ్రేట్ చేసుకునే రోజైన జూన్ 22నే ఆ సినిమాను రిలీజ్ చేయడానికి విజయ్ అండ్ కో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.