సాయిపల్లవి అంత స్ట్రాంగ్‌గా ఫిక్సయిపోయిందా?


మెగాస్టార్ చిరంజీవిని ఆరాధించే ఓ నటికి ఆయనతో ఒక సినిమా చేసే అవకాశం వస్తే వదులుకుంటుందా? ఆ సినిమా ఎలాంటిదైనా, పాత్ర ఏ తరహాదైనా నో చెబుతుందా? కానీ సాయిపల్లవి అవకాశం వదులుకుంది. చిరు సినిమాకు నో చెప్పింది. తమిళ హిట్ ‘వేదాళం’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో చిరు సోదరిగా కీలక పాత్రకు ముందు అడిగింది సాయిపల్లవినే. కానీ ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో కీర్తి సురేష్‌ను ఆ పాత్ర కోసం ఎంచుకున్నారు.

ఇన్నాళ్లూ ఇది మీడియాలో ఉన్న ప్రచారం మాత్రమే. కానీ ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కుదిరితే సాయిపల్లవికి జోడీగా డ్యాన్స్ వేయాలని కోరుకుంటానని.. తనకు చెల్లెలిగా ఆమె నటించకపోవడం మంచిదే అని చిరు చెప్పుకొచ్చారు. చిరు ఇలా అంటుంటే సాయిపల్లవికి చాలా ఇబ్బందిగా అనిపించింది.

నేను మీ సినిమాను కాదనడమా.. అంత మాట అనకండి అంటూ సాయిపల్లవి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. తనకు రీమేక్ సినిమాలంటే భయం అని.. అందుకే ఈ సినిమా ఒప్పుకోలేదని సాయిపల్లవి వివరణ ఇచ్చింది. ఒక కథానాయికకు రీమేక్‌ల విషయంలో ఎంత అయిష్టత ఉన్నప్పటికీ.. చిరంజీవి సినిమా అంటే ఆ రూల్ పక్కన పెట్టి మరీ నటిస్తుంది. హీరోల్లో మహేష్ బాబు కూడా రీమేక్స్‌లో నటించకూడదని కెరీర్ ఆరంభంలోనే నిర్ణయం తీసుకున్నాడు. దానికి కట్టుబడే ఉన్నాడు. కానీ హీరోయిన్లకు ఇంత లగ్జరీ ఉండదు. వాళ్లకంత ఛాయిస్ ఉండటం అరుదే. కానీ సాయిపల్లవి ఈ విషయంలో చాలా దృఢంగానే నిలబడుతోంది.

చిరు చిత్రమే కాదు.. పవన్‌కు జోడీగా ‘భీమ్లా నాయక్’లో నటించే అవకాశం వచ్చినా ఆమె వదులుకుంది. అది కూడా రీమేకే అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల సినిమాలే కాదన్నదంటే రీమేక్‌ల విషయంలో ఆమె ఎంత బలంగా ఫిక్సయిందో అర్థం చేసుకోవచ్చు. సాయిపల్లవి ఎంత అరుదైన హీరోయినో చెప్పడానికి ఇది రుజువు.