మరుగున పడ్డ సినిమా బయటికొస్తోంది

టాలీవుడ్లో చాలా మంది స్టార్లకు తిరుగులేని విజయాలందించిన అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్‌కు మాత్రం అలాంటి హిట్ ఇవ్వలేకపోయాడు. తండ్రి దర్శకత్వంలో ఆకాశ్ పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేసిన ‘మెహబూబా’ డిజాస్టర్ కావడం తెలిసిందే. దీని తర్వాత ఆకాశ్ హీరోగా ‘రొమాంటిక్’ అనే సినిమా మొదలు కావడం తెలిసిందే.

పూరినే దీనికి స్క్రిప్టు రాయగా.. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించాడు. హాట్ హాట్ ప్రోమోలతో గత ఏడాది ‘రొమాంటిక్’ యూత్ దృష్టిని బాగానే ఆకర్షించింది. కానీ ఉన్నట్లుండి ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది. సినిమా ప్రోగ్రెస్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. రిలీజ్ గురించి సమాచారమే లేదు. ఈ సినిమాను మధ్యలో ఆపేశారని, ఇది విడుదల కాకపోవచ్చని మధ్యలో వార్తలు కూడా వచ్చాయి. అయినా చిత్ర బృందం నుంచి స్పందన లేకపోయింది.

ఐతే దాదాపు ఏడాది నుంచి మరుగున పడి పోయిన ‘రొమాంటిక్’ ఎట్టకేలకు తిరిగి వార్తల్లోకి వచ్చింది. సైలెంటుగా ఈ సినిమాకు సెన్సార్ పూర్తి చేయించేశారు. అంటే ఆల్రెడీ ఫస్ట్ కాపీతో సినిమా రెడీగా ఉందన్నమాట. సెన్సార్ కూడా చేయించారంటే అతి త్వరలోనే విడుదల అని స్పష్టమైంది. థియేటర్లలోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ చిత్రంలో పూరి ఆకాశ్ సరసన కొత్తమ్మాయి కేతిక శర్మ నటించింది. పోస్టర్లలో, ఇతర ప్రోమోల్లో కేతిక చాలా హాట్‌గా కనిపించింది.

హీరో హీరోయిన్ల హాట్ రొమాన్సే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. టైటిల్ దగ్గర్నుంచి అన్నీ కూడా రొమాంటిక్ యాంగిల్లోనే కనిపించాయి. మరి ఈ రొమాన్స్ ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చింది పూరీనే. ఈ సినిమాను పూర్తి చేసి ఆకాశ్ ఇప్పటికే ‘చోర్ బజార్’ అనే మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.