అవును.. బాలీవుడ్లో నటిస్తున్నా


హీరో పక్కన కనిపించే చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత కాస్త గుర్తింపున్న క్యారెక్టర్ రోల్స్ చేసి.. ఆపై హీరోగా మారి మంచి మంచి అవకాశాలు అందుకుంటున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం ప్రతిభతో ఒక స్థాయిని అందుకున్న అతి కొద్దిమందిలో అతనొకడు. ప్రస్తుతం తమన్నా లాంటి స్టార్ హీరోయిన్‌తో అతను ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తున్నాడు. అగ్ర దర్శకుడు కొరటాల శివ.. సత్యదేవ్‌ కొత్త సినిమాను సమర్పిస్తుండటం విశేషం.

తిమ్మరసు, గాడ్సే, స్కైలాబ్ లాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో అతను బిజీగా ఉన్నాడు. సత్యదేవ్ ఓ భారీ హిందీ చిత్రంలోనూ నటిస్తున్నట్లు ఇంతకుముదు వార్తలొచ్చాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆ చిత్రమే.. రామ్ సేతు. ఇంతకుముందే ‘బుడ్డా హోగా తేరా బాప్’లో ఓ చిన్న పాత్ర చేసిన సత్యదేవ్.. ఇప్పుడు ‘రామ్ సేతు’లో ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు. దీనిపై ఇప్పటిదాకా అధికారిక సమాచారం లేదు.

ఐతే తాను ‘రామ్ సేతు’లో నటిస్తున్న విషయాన్ని సత్యదేవ్ స్వయంగా ధ్రువీకరించాడు. ఆదివారం సత్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘రామ్ సేతు’లో తాను నటిస్తున్నానని.. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌కు హాజరవబోతున్నానని అతను వెల్లడించాడు.

ఇక తెలుగులో నటిస్తున్న సినిమాల ప్రోగ్రెస్ గురించి సత్యదేవ్ మాట్లాడుతూ.. “తిమ్మరసు షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ‘గాడ్సే’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకో 15 రోజులు చిత్రీకరణ జరపాలి. ‘స్కైలాబ్’ షూటింగ్ అయిపోయింది. తమన్నాతో చేస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ చాలా స్పెషల్. నేను నటుడిగా అరంగేట్రం చేయడానికి ముందే ఆమె పెద్ద స్టార్. ఈ రోజు ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నానంటే ఏదో సాధించాననిపిస్తోంది. ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నేను మూడు రకాల గెటప్పుల్లో కనిపిస్తా. ఈ సినిమా షూటింగ్ ఇంకో పది రోజులే మిగిలుంది. ఈ సినిమాలన్నీ ఏడాది వ్యవధిలో రిలీజవుతాయి’’ అని సత్యదేవ్ తెలిపాడు.