ప్రస్తుతం ఇండియా మొత్తంలో అత్యంత డిమాండ్ ఉన్న రచయితల్లో ఒకరు విజయేంద్ర ప్రసాద్. బాహుబలితో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోయింది. భజరంగి భాయిజాన్, మెర్శల్, మణికర్ణిక లాంటి చిత్రాలతో వేరే భాషల్లోనూ ఆయన పేరు సంపాదించారు. తన కొడుకు రాజమౌళి కొత్త సినిమా ఆర్ఆర్ఆర్‌కు కూడా విజయేంద్రనే కథ అందించారు. హిందీలో సీత అనే భారీ సినిమాకూ ఆయన స్క్రిప్టు అందించారు. ఈ లెజెండరీ రైటర్ కొత్తగా పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ రాశారని.. అది చాలా పవర్ ఫుల్ సబ్జెక్ట్ అని ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పవన్‌కు విజయేంద్ర ఈ కథ కూడా వినిపించారని.. ఆయనకు నచ్చిందని కూడా అంటున్నారు. మరి ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్, రాజమౌళి కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. మరి చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రాజమౌళే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడా.. లేదా వేరే దర్శకుడెవరైనా ఆ బాధ్యతలు తీసుకుంటాడా అన్నది చూడాలి.
ప్రస్తుతానికైతే పవన్ కోసం విజయేంద్ర స్టోరీ అన్నది ఒక రూమర్ మాత్రమే. దీనిపై అధికారిక సమాచారం ఏమైనా వస్తుందేమో చూడాలి. పవన్ మీద విజయేంద్రకు ప్రత్యేకమైన అభిమానం ఉన్న మాట మాత్రం వాస్తవం. ఏ ఇంటర్వ్యూలో అయినా పవన్ గురించి ప్రస్తావన వస్తే చాలా గొప్పగా మాట్లాడతాడు. పవన్ కోసం ఒక కథ కూడా అక్కర్లేదని.. ఆయన సినిమాలో ఉంటే చాలని.. జనాలు చూసేస్తారని.. ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే. బాహుబలిలో ఇంటర్వెల్ సీన్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాసినట్లు కూడా ఆయన గతంలో వెల్లడించడం విదితమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates