హిట్ పెయిర్ అనిపించుకున్న హీరో హీరోయిన్లు కలిసి మళ్లీ సినిమా చేస్తే ఎలా ఆసక్తి రేకెత్తుతుందో.. ఒక సినిమాలో సై అంటే సై అంటూ తలపడ్డ హీరో, విలన్ మళ్లీ మరో సినిమాలో కలిసి నటించినా అంతే ఆసక్తి కలుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సమవుజ్జీ అనిపించి.. అతడికి విలన్‌గా కెమిస్ట్రీ బాగా పండించిన వాళ్లలో ప్రకాష్ రాజ్ పేరు ముందు చెప్పుకోవాలి.
బద్రి సినిమాలో నందాగా ప్రకాష్ రాజ్ పండించిన విలనీ.. పవన్‌కు, ఆయనకు మధ్య వచ్చిన సన్నివేశాలు ఎలా పేలాయో తెలిసిందే. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు దాటినా ఇంకా అందులోని సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు అభిమానులు. ఈ మధ్యే వకీల్ సాబ్ సినిమాలో పవన్, ప్రకాష్ రాజ్ మరోసారి తలపడ్డారు. ఈసారి వారి మధ్య యాక్షన్ ఘట్టాలేమీ లేకపోయినా.. కోర్టులో లాయర్లుగా ఒకరితో ఒకరు తలపడే సన్నివేశాలను బాగా పండించారు.
ఐతే ఈసారి అలా కాకుండా బద్రిలో మాదిరి ఫిజికల్‌గా తలపడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది టాలీవుడ్లో. పవన్ త్వరలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ పాత్రను ప్రకాష్ రాజ్‌తోనే చేయించనున్నారట. ఇటీవలే హరీష్ బద్రి సినిమాలో పవన్ యాటిట్యూడ్ చూపించే సన్నివేశాలతో కూడిన ఓ వీడియోను షేర్ చేసి ఈ ఎనర్జీని మళ్లీ చూద్దాం అంటూ పవన్ అభిమానులను ఊరించిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ మళ్లీ పవన్ సినిమాలో నటించనున్న నేపథ్యంలోనే హరీష్ ఈ వీడియో షేర్ చేసి, ఆ కామెంట్ పెట్టాడని భావిస్తున్నారు. కాబట్టి పవన్, ప్రకాష్ రాజ్ కాంబో మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates