టాలీవుడ్ అన్‌లాక్-2లో ఫ‌స్ట్ రిలీజ్ డేట్


క‌రోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో నెమ్మ‌దిగా క‌ద‌లిక వ‌స్తోంది. లాక్ డౌన్ ష‌ర‌తుల‌ను స‌డ‌లించి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వ్యాపారాలు స‌హా అన్ని కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవడానికి తెలంగాణ‌లో అనుమ‌తులు రావ‌డంతో షూటింగ్స్ పునఃప్రారంభానికి స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు తిరిగి సెట్స్ మీదికి వెళ్లాయి. త్వ‌ర‌లోనే మిగ‌తా చిత్రాల బృందాలు కూడా సెట్స్‌లోకి అడుగు పెట్ట‌బోతున్నాయి.

ఐతే థియేట‌ర్లు ఎప్ప‌టికి పునఃప్రారంభం అవుతాయి.. కొత్త సినిమాలు ఎప్పుడు రిలీజ‌వుతాయ‌న్న‌దే తేలాల్సి ఉంది. ఈ నెల‌లో అయితే అవ‌కాశం లేన‌ట్లే క‌నిపిస్తోంది. థియేట‌ర్ల‌పై ప్ర‌త్యేకంగా నియంత్ర‌ణ ఏమీ లేదు. ఇప్పుడు కూడా సాయంత్రం 6 గంట‌ల లోపు రెండు షోలు న‌డిపించుకోవ‌డానికి అవ‌కాశ‌ముంది.

కానీ జ‌నాలు ఇప్పుడిప్పుడే థియేట‌ర్లకు వ‌చ్చే మూడ్‌లో లేరు. ఆక్యుపెన్సీ విష‌యంలోనూ క్లారిటీ లేదు. 50 శాతానికే అనుమ‌తి ఇచ్చే అవ‌కాశాలున్నాయంటున్నారు. ఆగ‌స్టుకు కానీ థియేట‌ర్లు పునఃప్రారంభం కాక‌పోవ‌చ్చ‌నుకుంటున్నారు. ఐతే థియేట‌ర్ల విష‌యంలో స్ప‌ష్ట‌త లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఓ కొత్త సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేయ‌డం విశేషం. టాలీవుడ్ అన్ లాక్-2లో భాగంగా ముందుగా విడుద‌ల ఖ‌రారు చేసుకున్న ఆ సినిమా.. ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం.

రాజావారు రాణివారుతో హీరోగా ప‌రిచ‌యం అయిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా, ట్యాక్సీవాలా భామ ప్రియాంక జ‌వాల్క‌ర్ క‌థానాయిక‌గా న‌టించిన చిత్ర‌మిది. గ‌త ఏడాది వ‌చ్చిన దీని టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. ఈ సినిమాను ఆగ‌స్టు 6న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. శంక‌ర్ పిక్చ‌ర్స్ అనే సంస్థ ఎస్ఆర్ క‌ళ్యాణ మండ‌పం వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను రూ.4.5 కోట్ల‌కు కొంద‌ట‌. ఈ చిన్న సినిమాకు ఇది పెద్ద రేట‌నే చెప్పాలి. శ్రీధ‌ర్ గాదె అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన ఈ చిత్రానికి స్క్రిప్టు అందించింది హీరో కిర‌ణే కావ‌డం విశేషం.