ఎవరూ మాట్లాడ్డం లేదు విశ్వక్

కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఫంకీ డిజాస్టర్ గురించి స్పందిస్తూ ఆ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, లాంగ్ రన్ లో దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటారని గర్వంగా చెప్పుకొచ్చాడు. అంటే తన ఉద్దేశంలో థియేటర్లలో ఎందరో మిస్సయ్యారు కాబట్టి వాళ్లంతా ఓటిటిలో చూసి ఆహా ఓహో అనేసి అండర్ రేటెడ్ అంటారని, టాలీవుడ్ ఫెయిల్డ్ హియర్ అని ట్యాగ్ చేస్తారని ఊహించి ఉండొచ్చు.

కానీ జరుగుతోంది వేరు. ఫంకీ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. కొత్త రిలీజ్ కాబట్టి వ్యూస్ అయితే ఉన్నాయి కానీ విశ్వక్ అనుకున్నట్టు సోషల్ మీడియాలో దీని గురించి ఎలాంటి డిస్కషన్ లేదు. పైపెచ్చు ఇదేం కామెడీ అంటూ ట్రోల్ చేస్తున్న ట్వీట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. దర్శకుడు కెవి అనుదీప్ గత చిత్రం ప్రిన్స్ ఫ్లాప్ అయినప్పటికీ డిజిటల్ రిలీజ్ తర్వాత అందులో సీన్లు, జోకులు కాస్త వైరల్ అయ్యాయి. మీమర్స్ బాగానే వాడుకున్నారు. కానీ ఫంకీ దానికి కూడా నోచుకోలేదు.

ఏతావాతా తేలిందేమిటంటే ఫంకీ అన్నిరకాలుగా దెబ్బ తిన్న విషయం మీద క్లారిటీ వచ్చేసినట్టే. నాలుగు సిల్లీ జోకులతో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం జరగని పని. ఆడియన్స్ దాన్ని స్పెషల్ గా ఫీలవ్వాలి. అప్పుడే ప్రేక్షకులు లిటిల్ హార్ట్స్ లాంటి సూపర్ హిట్స్ చేతిలో పెడతారు. అంతే తప్ప ట్విట్టర్, ఇన్స్ టాలో ఫన్ తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపిస్తామంటే ఫంకీ అయినా, బలవంతంగా రుద్దే ఏ కామెడీ సినిమా అయినా ఒకే తరహా రెసెప్షన్ దక్కుతుంది.

విచిత్రం ఏమిటంటే ఫంకీ నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన సంగతి విశ్వక్ సేన్ తన హ్యాండిల్ లో ఇంకా షేర్ చేసుకోలేదు. వీడియో రూపంలో బైట్ ఇవ్వలేదు సరికదా కనీసం పోస్టర్ పెట్టి ట్వీట్ కూడా చేయలేదు. బిజీ ఉన్నాడని అనుకోవచ్చు కానీ పోస్ట్ చేయడానికి పట్టే టైం కేవలం నిమిషాలేగా. ఇదంతా ఓకే కానీ ముందైతే విశ్వక్ సేన్ వాస్తవిక దృక్పథంతో అలోచించి తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించి కల్ట్, లెగసితో అయినా విజయాలు అందుకోవాలి. అభిమానులు అంతకంటే ఆశించేది ఏముంది.