అప్పుడు గబ్బర్ సింగ్.. ఇప్పుడు వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని సినిమాల్లో ‘గబ్బర్ సింగ్’ ఒకటి. ఈ సినిమా మొదలైనపుడు పెద్దగా అంచనాల్లేవు. రీమేక్ మూవీ, పైగా హరీష్ శంకర్ దర్శకుడు అనేసరికి అభిమానుల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కానీ ట్రైలర్ చూశాక కొంచెం గురి కుదిరింది. ఇక థియేటర్లో బొమ్మ పడ్డాక ఏమైందో అందరికీ తెలిసిందే.

అభిమానుల అంచనాలను మించిపోయి సినిమాను ఎక్కడో తీసుకెళ్లి పెట్టేశాడు హరీష్. హిందీలో ‘దబంగ్’ చూసిన వాళ్లకు.. తెలుగులో ‘గబ్బర్ సింగ్’ చూస్తే చాలా భిన్నంగా కనిపించింది. నెమ్మదిగా, సటిల్‌గా సాగే ‘దబంగ్’ను.. చాలా హుషారుగా హరీష్ మార్చిన విధానం హైలైట్‌గా నిలిచింది. అందుకే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అని అందరూ వేసుకునేలా కాకుండా ‘మాటలు, మార్పులు, దర్శకత్వం’ అంటూ కొత్త ట్యాగ్ వేసుకున్నాడు హరీష్. టైటిల్స్‌లో ఇలా చూసినపుడే ‘గబ్బర్ సింగ్’లో ఏదో విశేషం ఉందనే అభిప్రాయం జనాల్లో కలిగింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఒక హిస్టరీ.

ఇప్పుడు వేణు శ్రీరామ్ కూడా సరిగ్గా ఇదే పని చేశాడు. హరీష్‌ను అనుకరిస్తున్నా అనుకోకుండా ‘వకీల్ సాబ్’ టైటిళ్లలో తాను కూడా ‘మాటలు, మార్పులు, దర్శకత్వం: వేణు శ్రీరామ్’ అని వేసుకున్నాడు. ఇది చూడగానే మరో ‘గబ్బర్ సింగ్’ చూడబోతున్నామన్న ఫీలింగ్ అభిమానులకు కలిగింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ‘పింక్’తో పోలిస్తే ‘వకీల్ సాబ్’ చాలా భిన్నంగా కనిపించింది. పవన్ కోసం ఒక ఫ్లాష్ బ్యాక్ సహా హీరో ఎలివేషన్ సీన్లు చాలానే రాశాడు వేణు. అవన్నీ అభిమానులను అలరించేవే. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండాలన్న అభిప్రాయం కలిగింది.

ఇక ద్వితీయార్ధంలో కోర్ట్ రూం డ్రా విషయానికి వస్తే హిందీలో అంతా కూడా సటిల్‌గా, సైలెంటుగా నడిచిపోతే.. ఇక్కడ మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా అంతా లౌడ్‌గా తీర్చిదిద్దాడు వేణు. ప్రతి సన్నివేశంలోనూ పవన్‌ను ఎలివేట్ చేయడానికి చూశాడు. ఎంటర్టైనింగ్‌గా మార్చే ప్రయత్నం చేశాడు. పవన్ ఇమేజికి తగ్గట్లుగా సన్నివేశాలను మార్చడం, పేలిపోయే డైలాగులు రాయడం ద్వారా అతను మార్కులు కొట్టేశాడు.