నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థిని మీద ఒక యువకుడు రంపపు మెషీన్ తో దాడి చేసిన ఘటన ఎంత దుమారం రేపిందో చూస్తూనే ఉన్నాం. పట్టపగలు వందలాది మంది ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇంత దారుణం జరగడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. నిందితుడు త్వరగా పట్టుబడ్డాడు కానీ ఆ చిన్నారి పరిస్థితి తలుచుకుని కంటతడి పెట్టని వారు లేరు. ఈ సందర్భంగానే యువత మీద సినిమాల ప్రభావం టాపిక్ మరోసారి తెరమీదకు వస్తోంది.
యానిమల్ లో రన్బీర్ కపూర్ స్టూడెంట్ వయసులో తుపాకీ పట్టుకుని క్లాసులోకి వెళ్లడాన్ని ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తూ ఇలాంటివే లేత మనసుల మీద ప్రభావం చూపిస్తున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సందీప్ వంగ ఇలాంటి వయొలెన్స్ చూపించడం తగ్గించాలని నిలదీస్తున్నారు. వాళ్ళు అన్నదాంట్లో కొంత వరకు పాయింట్ ఉందనుకున్నా దాన్ని పూర్తిగా సమర్ధించలేం. ఎందుకంటే హింసని మొదలుపెట్టింది సందీప్ కాదు, ఇకపై చూపించబోయేది తనొక్కడే కాదు.
ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో చూపించే వయొలెన్స్ రూపు రేఖలు మార్చుకుంటోంది. భాషతో సంబంధం లేకుండా అన్నింటిలోనూ ఈ పోకడ ఉన్న మాట వాస్తవం. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం ఆషిక్ బనాయా ఆప్నేలో నీలి చిత్రాల స్థాయిలో రొమాన్స్ చూపించినా సెన్సార్ ఏ సర్టిఫికెటీ ఇచ్చి థియేటర్లకు వదిలింది. పూలన్ దేవి బయోపిక్ బాండిట్ క్వీన్ లో సీమా బిశ్వాస్ తో దుస్తులు లేకుండా నటింపజేసినా అది కథ ప్రకారం డిమాండ్ చేసిందంటూ సమర్ధింపులు జరిగాయి.
తాజాగా జరిగిన ఘటన కూడా మొదటిసారిది కాదు. చాలా సంవత్సరాల క్రితం ఒక బెజవాడ కాలేజీలో ఇలాంటి సంఘటనే జరిగింది. దాన్నే కృష్ణవంశీ రాఖీలో చూపించారు కూడా. అంతకు ముందు అంకురంలో ఒక పోలీస్ కూతురిని క్లాస్ రూములో తగలబెట్టిన సీన్ చాలా సహజంగా చిత్రీకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి భాషలో వందల వేల ఉదాహరణలు వస్తాయి. ఇది సందీప్ వంగాని సమర్ధించే ప్రయత్నం కాదు. కేవలం యానిమల్ తో మొదలుకాలేదని చెప్పే ఉద్దేశం మాత్రమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates