తమిళనాడు సిఎం జోసెఫ్ విజయ్ వారసుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తన తొలి ప్రయత్నం సిగ్మాతో చేయడం అది దారుణంగా పోవడం అంత సులభంగా మర్చిపోయేది కాదు. సందీప్ కిషన్ ని హీరోగా పెట్టి భారీ కాన్వాస్ తో తీసిన ఆ యాక్షన్ డ్రామా కనీస స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విదేశాల్లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేసి వచ్చి చెన్నై స్టూడెంట్ లా తీసిన వైనం నిర్మాతకు నష్టాలే మిగిల్చింది. నాన్ థియేటర్ రైట్స్ వల్ల ఊరట దక్కింది కానీ లేదంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండేది.
దీంతో కర్తవ్యం బోధ పడిన జేసన్ సంజయ్ హీరోగా త్వరలోనే అడుగులు వేయబోతున్నట్టు సమాచారం. ఈ బాధ్యతను విజయ్ కు మూడు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడు అట్లీ తీసుకున్నారని చెన్నై టాక్. అయితే డైరెక్టర్ గా కాకుండా నిర్మాతగా మారి ఈ ప్రాజెక్టు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారట. మెగా ఫోన్ ని డ్యూడ్ ఫేమ్ కీర్తీశ్వరన్ కు ఇవ్వనున్నట్టు తెలిసింది. సిగ్మాని విజయ్ అస్సలు పట్టించుకోలేదు. దాన్ని ప్రమోట్ చేస్తే ప్రతిపక్షాలు గోల చేస్తాయని అసలా ఊసే ఎక్కడా తేలేదు.
ఇప్పుడు కొడుకు హీరోగా మారితే టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే తమిళనాడుతో పాటు విదేశాల్లోనూ ఉన్న కోట్లాది విజయ్ ఫ్యాన్స్ తమ నాయకుడి బిడ్డకు స్వాగతం చెప్పే బాధ్యతను వద్దన్నా తీసుకుంటారు. ఓపెనింగ్స్ హోరెత్తిపోతాయి. మన దగ్గర మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లకు ఏ వెల్కమ్ దక్కిందో అంతకి మించి తమిళ జనాలు ఫ్యానిజం చూపిస్తారు. అంచనాలు నిలబెట్టుకుంటే మటుకు జేసన్ సంజయ్ కు రెడ్ కార్పెట్ సిద్ధంగా ఉంది.
జేసన్ సంజయ్ సంగతలా ఉంచితే టాలీవుడ్ లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అకీరానందన్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అతనేమో మ్యూజిక్, డైరెక్షన్ అంటూ ఇటువైపు చూడటం లేదు. నిజంగా నటన వైపు ఆసక్తి ఉంటే వెంటనే వచ్చేయాలని కోరుతున్నారు. మోక్షజ్ఞ లాగా మరీ ఆలస్యం చేస్తే మంచి అవకాశాలు చేజారిపోవచ్చని వాళ్ళ భయం. అయితే అకీరానందన్ ఇప్పుడప్పుడే ఈ విషయాన్ని తేల్చేలా లేడు. ఈలోగా జేసన్ సంజయ్ స్టార్ అవుతాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates