హీరోయిన్ కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఉంటున్నప్పటికీ.. ఎన్నడూ అహంకారం చూపించింది లేదు. ఎప్పుడూ చాలా అణకువతో మాట్లాడతాడు. సినిమా ఇంటర్వ్యూల్లో అయినా, ఈవెంట్లలో అయినా.. ఎవరి గురించైనా సరే మంచి మాటలే చెబుతుంటాడు కానీ.. ఆయన నోటి నుంచి విమర్శ అన్నదే రాలేదు అంటే అతిశయోక్తి కాదు.

తనకంటే చాలా చిన్న వాళ్లు, చిన్న స్థాయి వ్యక్తులతో కూడా చాలా గౌరవంగా వ్యవహరిస్తాడు త్రివిక్రమ్. ఇప్పుడు మరోసారి ఆయన తన వినమ్రతను చాటుకున్నాడు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర కథానాయిక శ్రీనిధి శెట్టికి త్రివిక్రమ్ పాదాభివందనం చేయబోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్ ముందే వచ్చేయగా.. శ్రీనిధి కొంచెం లేటుగా హాజరైంది. ఆమె ఆడిటోరియంలోకి అడుగుపెట్టి ఒక్కొక్కరికి నమస్కారం చేసుకుంటూ.. త్రివిక్రమ్ దగ్గరికి వచ్చింది. అంతలో ఆయన కిందికి వంగి ఆమె కాళ్లు మొక్కబోయాడు. ఈ పరిణామానానికి అవాక్కయిన శ్రీనిధి ఆయన్ని వారించింది. తనే త్రివిక్రమ్‌కు పాదాభివందనం చేసింది. వయసులో, విద్వత్తులో తనకంటే చాలా చిన్నదైన శ్రీనిధికి త్రివిక్రమ్ ఇలా కాళ్లు మొక్కు ప్రయత్నం చేయడం ఊహకందని పరిణామమే. మరి శ్రీనిధి వ్యక్తిత్వంలో త్రివిక్రమ్ ఏం గొప్పదనం చూశాడో?

ఈ ఈవెంట్లో స్పీచ్ ఇస్తూ కూడా శ్రీనిధి గురించి చక్కగా మాట్లాడాడు త్రివిక్రమ్. ‘ఆదర్శ కుటుంబం’ కథ చెప్పినపుడు ఈ పాత్రకు నేను ఓకే కానీ.. నేను ఈ సినిమాకు ఓకేనా అంటూ అడిగిందని గుర్తు చేసుకున్నాడు త్రివిక్రమ్. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘ఆదర్శ కుటుంబం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ మీద సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు.