హైందవ తప్పుకోవడం నాయుడుకి మంచిదే  

వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన హైందవ వాయిదా వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరికి వెళ్లనున్నట్టు తెలిసింది. రిలీజ్ కు రెడీగా ఉన్న టైసన్ నాయుడు డిసెంబర్ 11 రావొచ్చనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. రెండింటి మధ్య తగినంత గ్యాప్ ఉండాలి కాబట్టి అన్ని కోణాల్లో అలోచించి నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వినికిడి. బాక్సాఫీస్ వద్ద సేఫ్ గేమ్ ఆడాలంటే ఇదే మంచి ఆప్షన్.

నెలాఖరున శర్వానంద్ భోగి, రష్మిక మందన్న మైసాతో పాటు హై అనే మరో చిన్న సినిమా కూడా వస్తోంది. వీటితో పోటీ వల్ల తప్పుకోవడం కాదు కానీ హైందవకు ప్రమోషన్ల పరంగా టైం సరిపోవడం లేదు. ఇప్పటికైతే జనాల దృష్టిలో అంతగా పడలేదు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ హైప్ పరంగా ఇంకేదో చేయాల్సిన అవసరం ఉంది. అందులోనూ గత రెండు వారాల్లో వచ్చిన నాలుగు సినిమాలు డీసెంట్ టాక్ తో థియేటర్లలో బాగానే ఆడుతున్నాయి.

ఈ నేపథ్యంలో హైందవకు హడావిడి పడటం కన్నా కొంచెం ఆలస్యమైనా పక్కా ప్లానింగ్ తో రావడం చాలా మంచిది. ఇక టైసన్ నాయుడు విషయానికి వస్తే ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉండిపోయిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి త్వరలో మోక్షం దక్కనుంది. నిన్న విడుదల చేసిన టీజర్ ద్వారా కొంత మూమెంట్ అయితే తీసుకురాగలిగారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన టైసన్ నాయుడు 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందింది. కొంత కాలంగా ల్యాబులోనే మగ్గుతోంది.

ఎలా చూసినా రెండు మూడు నెలల గ్యాప్ లో సాయి శ్రీనివాస్ రెండు సినిమాలు రాబోతున్నాయనే క్లారిటీ అయితే వచ్చేసింది. శర్వానంద్ భోగి, జార్జ్ క్రిష్ కూడా ఇంచుమించు ఇంతే గ్యాప్ తో ఆడియన్స్ ని పలకరించబోతున్నాయి. తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చి మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్న సాయి శ్రీనివాస్ కు టైసన్ నాయుడు, హైందవ విజయం సాధించడం చాలా కీలకం. రెండు వేర్వేరు జానర్లు, రొటీన్ ఫార్ములాతో రూపొందినవి కాకపోవడంతో కాన్ఫిడెన్స్ బలంగానే ఉంది.