ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా మీద హైప్ ఆశించినంత భీభత్సంగా లేదనేది అభిమానులు బాగా ఫీలవుతున్న పాయింట్. ఓవర్సీస్ తో పాటు రజినీకి బలమైన పట్టున్న కర్ణాటకలోనూ టికెట్ సేల్స్ ఉదృతంగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఏడాది కూలికి కనిపించిన ప్రీ రిలీజ్ సునామి ఈసారి ఆ స్థాయిలో లేదనేది ఒప్పుకోవాల్సిన విషయం.
దానికి కారణాలు లేకపోలేదు. ట్రైలర్ మరీ ఎగ్జైటింగ్ గా అనిపించలేదు. బజ్ పెరిగేందుకు సరిపడా అంశాలను అందులో బ్యాలన్స్ చేయలేదు. పైగా అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకే అనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకోవడం ప్రభావం చూపించింది. రమ్యకృష్ణతో సహా హీరో ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళను రివీల్ చేయలేదు. నేరుగా స్క్రీన్ మీద చూపించడం కోసం హృతిక్ రోషన్ క్యామియోని దాచి పెట్టారు. విలన్ సూరజ్ ని మాత్రమే ఎక్కువ హైలైట్ చేసుకున్నారు.
షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వకపోవడం, సన్ పిక్చర్స్ సరైన ప్లానింగ్ అనుసరించకపోవడం ఎఫెక్ట్ చూపించాయి. రాకా మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్లే జైలర్ 2కి ఇలాంటి పొరపాట్లు జరిగాయని కొందరు రజినీ ఫ్యాన్స్ అభిప్రాయం. అందులో నిజముందని చెప్పలేం కానీ స్ట్రాటజీ సరిగా లేదనేది వాస్తవం. డిసికి ఎలాంటి పబ్లిసిటీ చేయకుండా సూపర్ హిట్ కొట్టిన సన్ పిక్చర్స్ బహుశా జైలర్ 2కి అదే రిపీట్ అవుతుందని భావిస్తుందేమో.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నలభై అయిదు కోట్లకు హక్కులు కొన్న నాగవంశీ దీని మీద పెద్ద పందెమే కాశారు. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు తెచ్చుకోవడం గురించి సోషల్ మీడియాలో డిబేట్లు జరుగుతూనే ఉంటాయి. పాజిటివ్ టాక్ వస్తే ఇదేం పెద్ద విషయం కాదు. ఆడియన్స్ చూసేస్తారు. లేదంటేనే సమస్య. కూలి ఫలితం నిరాశ పరిచాక రజని కంబ్యాక్ మూవీ ఇదే అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. దర్శకుడు నెల్సన్ మీద ఈ ఒత్తిడి అయితే చాలానే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates